Posts Tagged ‘Innaiah’

వివేచన, ఉద్వేగవాదం, విప్లవం – ఎమ్.ఎన్.రాయ్

March 5, 2013

బొమ్మ

మానవేంద్రనాథ్ రాయ్ (ఎమ్.ఎన్.రాయ్) తన జీవితంలో చివరి దశలో రాసిన బృహత్తర తాత్విక చింతనాగ్రంథం ఇది. రెండు భాగాలుగా వెలువడిన ఈ రచన సమగ్ర మానవవాద తాత్విక చింతనగా పేర్కొనవచ్చు. 1952లో రాయ్ ఈ గ్రంథాన్ని పూర్తి చేశారు. ఇది వెలువడగానే పాశ్చాత్య లోకంలో మేథావులను ఆకట్టుకున్నది. సుప్రసిద్ధ సామాజిక శాస్త్రజ్ఞుడు ఎరిక్ ఫ్రాం (ERICH FROMM) దీనిపై అభిప్రాయం వెల్లడిస్తూ యూరోప్ లో జరిగిన పునర్వికాసాన్ని విప్లవ చరిత్రను అవగాహన చేసుకోవడానికి ఎమ్.ఎన్.రాయ్ రచన చదవమని తన గ్రంథం ‘సేన్ సొసైటీ’ లో స్పష్టీకరించారు.

గ్రంథ విస్తరణ వలన దీనిని రెండు భాగాలుగా ప్రచురించారు. మొదటి భాగంలో మానవ స్వభావం, నియమబద్ధ ప్రకృతి, మానవుడి తిరుగుబాటు, ఎదురు తిరిగిన దేవతలు, ప్రకృతి నియమం, ఆధునిక తత్వం పుట్టుక కొత్త విజ్ఞానం, జ్ఞాన వికాసం, మహోన్నత విప్లవం ఉన్నాయి. పరిపక్వత చెందిన తాత్విక శాస్త్రజ్ఞుడుగా ఆధునిక చరిత్రను విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్న వ్యక్తిగా ఎమ్.ఎన్.రాయ్ ఈ రచనలో కనిపిస్తారు. ఆయన భాషా శైలి కూడా విషయానికి తగ్గట్టే ఉంటుంది.

మానవ స్వభావాన్ని గురించి మతపరమైన చర్చలు అనాదిగా సాగుతుండగా ఎమ్.ఎన్.రాయ్ ఆధునిక విజ్ఞానం ఆధారంగా మానవుడు ప్రాయికంగా స్వేచ్ఛా ప్రియుడని సహకార జీవి అని తేల్చి చెప్పాడు. స్వభావాన్ని కప్పిపుచ్చే హేతురహిత నమ్మకాలు అడ్డు వస్తున్నాయని వాటిని తొలగించి అసలైన మానవ స్వభావాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలంటాడు రాయ్.

ప్రకృతిలోనే నియమబద్ధత ఉన్నదని కార్యకారణ సంబంధం అందులో అడుగడుగున కన్పిస్తున్నదని వాటిని తెలుసుకోవటానికి సైన్సు బాగా ఉపకరిస్తున్నదని చెప్పారు. ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా మానవుడిని నమ్మకాల కట్టుబాట్లలో బంధించిన ఆలోచనా రీతులను, యూరోప్ లో మొట్టమొదటిసారిగా తాత్విక చింతనాపరులు ఎదిరించి మానవుడుగా నిలదొక్కుకోవడానికి తోడ్పడ్డారు. ఆ విషయాలను సోదాహరణగా ఆయా తాత్వికుల రచనల ద్వారా రాయ్ ఈ గ్రంథంలో చూపారు. ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ తదితర దేశాలలో వచ్చిన తాత్విక చింతనలు శాస్త్రీయ పరిణామాలు మానవుడికి బాగా తోడ్పడ్డాయి. మధ్యయుగాల నుండే బయటపడిన ఈ దేశాలు ఆధునికతలోకి ప్రవేశించి నాగరికతను విప్పారజేశాయి. అక్కడే ఆధునిక తత్వం పుట్టింది. డేకార్ట్, డిడరో, రూసో, వోల్టేర్, స్సినోజా, కాంట్, హెగల్, నిషే మొదలైనవారెందరో తాత్విక రంగంలో చొచ్చుక పోయి మానసిక బంధాలను తెంచారు. వాటిని రాయ్ చూపిన తీరు ఎలా పరిణితి చెందినదో కన్పిస్తుంది. ఒకవైపున పారిశ్రామిక రంగం, మరొకవైపు శాస్త్రీయ పరిశోధనలు, ఇంకోపక్క సాహిత్యంలో పునర్వికాసం అన్నీ మేళవించుకుని కొత్తదారులు తొక్కాయి. అందువలన యూరోప్ లో మహోన్నత విప్లవానికి పరిస్థితులు దారితీశాయి. ఫ్రాన్స్ దీనికి గంట కట్టింది. విజ్ఞాన సర్వస్వం మనుషులకు ఆయుధంగా లభించింది. మానసిక సంకెళ్ళు తెంచుకోవటానికి ఇవన్నీ ఉపకరించాయి. విషయం బరువైనది. కాని చెప్పిన తీరు ఆకర్షణీయమైనది. అందుకే ఇది గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్తలను ఆకట్టుకున్నది.

ఈ పుస్తకం వెలువడిన కొత్తలోనే ప్రపంచ మానవవాద సంఘం ఆమ్ స్టర్ డాంలో ప్రారంభమైంది. ఎమ్.ఎన్.రాయ్ ను దానికి ఉపాధ్యక్షుడుగా పరోక్షంగానే ఎన్నుకున్నారు. జూలియన్ హక్సలీ వంటి ప్రపంచ శాస్తజ్ఞులు రాయ్ ఆలోచన పట్ల దృష్టి సారించారు. ఆవిధంగా ఈ గ్రంథం చరిత్రలో నిలదొక్కుకున్నది. ఈ పుస్తకాన్ని 1986లో తెలుగులోకి ఎన్. ఇన్నయ్య తీసుకువచ్చారు.

ఈ గ్రంథ రచయిత ఎమ్.ఎన్.రాయ్, తొలిపేరు నరేంద్రనాథ్ భట్టాచార్య. నేటి పశ్చిమ బెంగాల్ లో 1887లో పుట్టారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తీవ్రవాద జాతీయ రాజకీయాలలో పాల్గొని జర్మనీ సహాయంతో బ్రిటీష్ వారిని పారద్రోలాలని విదేశాలకు వెళ్ళారు. ఆ ప్రయాణంలో అమెరికాకు చేరుకుని యూనివర్సిటీలో ఎవిలిన్ ట్రెంట్ ను కలిసి ఆమెను పెళ్ళి చేసుకుని మెక్సికో వెళతారు. అక్కడ తొలిసారిగా రష్యా వెలుపల కమ్యూనిస్టు పార్టీని స్థాపించిన ఘనత రాయ్ దే. అది లెనిన్ దృష్టికి రాగా వారి ఆహ్వానంపై మాస్కో వెళ్ళి ప్రపంచ కమ్యూనిస్టు రాజకీయాలలో ప్రముఖ పాత్ర నిర్వహించారు. తాష్కెంట్ లో ప్రవాస భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించారు. తరువాత కమ్యూనిస్టు నాయకులతో భేదించి 1930లో ఇండియాకు తిరిగి రాగా బ్రిటిష్ వారు అరెస్టు చేసి ఆరేళ్ళు జైలులో వుంచారు. విడుదలైన తరువాత కొద్ది రోజులు కాంగ్రెస్ రాజకీయాలలో పాల్గొని 1940 నాటికి రాడికల్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించారు. పార్టీ రాజకీయాలు తప్పని తెలుసుకొని 1948లో పార్టీని రద్దు చేసి పునర్వికాస ఉద్యమాన్ని ప్రారంభించారు. 1955లో మరణించారు. ఐన్ స్టీన్ వంటి శాస్త్రజ్ఞులతో పరిచయంగల రాయ్ ఆధునిక విజ్ఞాన తాత్విక ఫలితాలు అద్భుతంగా రాశారు. ఎన్నో పత్రికలు నడిపారు. వందకు పైగా చిన్నా పెద్దా పుస్తకాలు రాశారు. దేశంలో అనేకమందికి శాస్త్రీయ ధోరణిలో రాజకీయాలు నేర్పారు. లెనిన్, స్టాలిన్, డ్రాటస్కీ, మావో, చౌఎన్ లై వంటి అగ్ర నాయకులతో వ్యవహరించారు.

ఎమ్.ఎన్.రాయ్ రచనలు ప్రధానమైనవన్నీ ఎన్.ఇన్నయ్య తెలుగులోకి తీసుకువచ్చారు. ఈ పుస్తకాన్ని దిగువ ఇచ్చిన గొలుసులలో  దిగుమతి చేసుకొనండి లేక చదవండి.

తెలుగు అనువాద పుస్తకం భాగం-1 కై ఇక్కడ నొక్కండి. భాగం-2 కై ఇక్కడ నొక్కండి.

ఆంగ్ల పుస్తకం Reason, Romanticism and Revolution కై ఇక్కడ నొక్కండి.

‘మిసిమి’ వ్యాసాలు

January 31, 2013

సమీక్ష:  గుమ్మా వీరన్న

Innaiah Misimi Vyasalu

‘మిసిమి’ మాసపత్రికలో ఇన్నయ్యగారు వివిధ అంశాలపై రాసిన వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం. ఇందులో ఇన్నయ్యగారు 1990 నుండి 2011 వరకు రాసిన 36 వ్యాసాలను పొందుపరిచారు. వాటిలో రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, ఇతర మేథావుల గురించి అనేక వ్యాసాలున్నాయి. వైద్య రంగంలోని మూఢ విశ్వాసాల గురించి, పిల్లల హక్కుల గురించి, ఇంద్రియాతీత శక్తుల గురించి రాసిన వ్యాసాలున్నాయి. ఇన్ని రకాల విభిన్న అంశాలను గురించి రాసినా వాటిలో హేతువాద ధోరణి, వ్యంగ్యం, హాస్యం కలగలిపిన ధోరణి పాఠకులను ఆసక్తిగా చదివిస్తాయి. మిసిమి సంపాదకులు, హేతువాదులైన ఆలపాటి రవీంద్రనాథ్ గారికి అంకితమివ్వడం  సమంజసంగా వుంది.

సుభాష్ చంద్రబోస్ గెలిస్తే దేశం ఏమయ్యేది? అనే వ్యాసంలో అప్పటివరకూ బోసు గురించి తెలియని చాలా విషయాలను చక్కగా వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు కవులను, నాటక కర్తలను ప్రభావితం చేసిన బెర్ టోల్ట్ బ్రెట్ (Bertolt Brecht) గొప్ప రచయిత, కవి, నాటకకర్త. అయితే తన నిజ జీవితంలో మాత్రం చాలా మంది యువతులను మోసం చేసి వాడుకున్నట్లు చాలామందికి తెలియని విషయాలను ఇన్నయ్యగారు తన వ్యాసంలో బయటపెట్టారు.

‘మేథావిగా సంజీవదేవ్’ అనే వ్యాసంలో కళలను గురించి ఇన్నయ్యగారొక సూచన చేశారు. “ఇన్నాళ్ళుగా కళలు, రమణీయతా రంగమంతా దైవ ప్రాధాన్యతతో, మత ప్రాదిపదికలతో సాగింది. అవి లేకుండా రమణీయత లేదనేటంతవరకూ తీసుకెళ్ళారు. వాస్తవానికి ఇన్ని కళల్ని మతం, దైవం పేరిట భ్రష్టు పట్టించారు. మనిషి మానసికంగా బానిస కావడానికి కళల్ని ప్రయోగించారు. ఈ ప్రభావం నుండి బయటపడడానికి కూడా సంజీవదేవ్ ప్రత్యామ్నాయ పద్ధతి అనుసరణీయం. మానవ విలువలతో కూడి కళలు, రమణీయకత నేటి అవసరం కూడా.” ఈనాడు సమాజంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు, కళలు అన్నీ దైవం, మతం వంటి భావాలతో నిండిపోయి వుండడాన్ని ఎవరైనా గుర్తించవచ్చు.  ఈ పరిస్థితులు మారాలని, అన్ని రకాల కళలలో లౌకికవాద, మానవవాద విలువలు ప్రతిబింబించాల్సిన అవసరం ఎంతయినా వుందని గుర్తించడంలో ఔచిత్యం వుంది.

‘నేటి తాత్విక విమర్శలు – ధోరణులు’ అనే వ్యాసంలో రెండవ ప్రపంచ యుద్ధానంతరం 1950 నుండి యూరప్, అమెరికా, ఆస్ట్రేలియాలలో ఆధునికతపైనా, మానవవాదం పైనా బయలుదేరిన విమర్శల గురించి, ప్రతి విమర్శల గురించి వివరించారు. హీడెగ్గర్, మైకల్ పూకో, జీన్ ఫ్రాంకో లెటార్డ్, డెరిడావంటివారు, అలెగ్జాండర్ సోల్జినిట్సిన్, ఇర్వింగ్ క్రిస్టల్, రిచర్డ్ జాన్, న్యూహాస్ మొదలైన ప్రముఖులు మానవవాదంపై తీవ్రమైన విమర్శలు చేశారు. వారి విమర్శలను దీటుగా ఎదుర్కొని సమాధానాలు చెప్పి మానవవాదాన్ని సమర్థించినవారిలో డేవిడ్ విల్సన్, జాన్ డ్యూయీ, కార్ట్ లెమాంట్, కార్ల్ శాగన్, ఐజక్ అసిమోవ్, పాల్ కట్జ్, అడాల్ఫ్ గ్రున్ బాం, బార్సరా స్మోకర్ మొదలైన వారున్నారు. వీరు హేతుబద్ధంగా, శాస్త్రీయంగా విమర్శలకు సమాధానాలు చెప్పడంలో సఫలీకృతులైనారని ఇన్నయ్యగారు తెలిపారు. ఆ విమర్శలనే ఆధునికానంతరవాదం (Post Modernism) అన్నారు. ఆ విమర్శలను మానవవాద రచయితలు, తాత్వికులు ప్రతిభవంతంగా తిప్పికొట్టారు.

‘నేను ముస్లిమును ఎందుకుకాను?’ అన్న గ్రంథాన్ని ఇబన్ వరాక్ రాశాడు. ఆ గ్రంథాన్ని సమీక్షిస్తూ ఇన్నయ్య రాసిన వ్యాసంలో ఇస్లాంలోని నియంతృత్వాన్ని, స్త్రీ పురుషుల మధ్యగల అసమానతలను, మానవహక్కుల అణచివేతను బాగా వివరించారు. ముస్లిందేశాలు ఇస్లాంను పాటిస్తూనే మానవహక్కుల్ని అంగీకరిస్తూ సంతకాలు చేశాయని, అయితే ఆచరణలో మాత్రం వాటిని అడ్డుకొంటున్నాయని స్పష్టం చేశారు.

“ఇస్లాం ప్రకారం స్త్రీలు ముస్లిములు కాని వారిని పెళ్ళి చేసుకోరాదు. ముస్లిం దేశాలలో నివసించే ముస్లిమేతరులకు కోర్టులోగాని, మరెక్కడా సమాన హక్కులులేవు. ముస్లిం దేశాలలో నాస్తికులు, నమ్మకం లేనివారు చంపబడాల్సిందే. ముస్లిం దేశాలలో ఇతర మతాలవారు తమ ప్రార్థనలు చేసుకోడానికి, బాహాటంగా గుడి, చర్చి నిర్మించడానికి, పవిత్ర గ్రంథాలు చదవడానికి వీల్లేదు. మానవ హక్కులు బానిసత్వాన్ని వ్యతిరేకిస్తుండగా ఇస్లాం గుర్తిస్తున్నది. బానిస స్త్రీలతో లైంగిక సంపర్కం ముస్లింలకు ఖురాన్ అనుమతిస్తున్నది. సురా 4:3”.

తల్లిదండ్రులు తమ పిల్లలను తమ ఆస్తిగా భావించి వాడుకుంటున్నారు. పిల్లలకున్న హక్కులను గుర్తించడంలేదు. పిల్లలను – హింసకు, దోపిడీకి, చాకిరీలకు, అమ్మకాలకు, అపహరణలకు దూరంగా ఉంచాలి. ఆడ, మగ తేడాలు పాటించరాదు. ఆరోగ్యాన్ని  కాపాడి విద్యాబుద్ధులు చెప్పించాలి. వారు స్వేచ్ఛగా తమ భావాలను, అభిప్రాయాలను వెల్లడించే వీలు కల్పించాలి. కాని తల్లిదండ్రులు వీటిని గుర్తించి ఆచరించడంలేదు. తమ మత విశ్వాసాలను, ఆచార సంప్రదాయాలను వారి మీద రుద్దుతున్నారు. వారిచేత చాకిరీలు చేయిస్తున్నారు. వారిని పనిముట్లలాగా వాడుకుంటున్నారు. ఇటువంటి అనేక వాస్తవాలను వెల్లడించే వ్యాసమే “పిల్లలకు హక్కులున్నాయి. కానీ…..”

దివ్యశక్తులున్నాయని మోసగించే వారిపట్ల సింహస్వప్నం జేమ్స్ రాండి. యూరిగెల్లర్ దివ్యశక్తులలోని మోసాన్ని బయటపెట్టినవాడు జేమ్స్ రాండి. మహిమలను, దివ్యశక్తులను నిరూపిస్తే అయిదుకోట్ల రూపాయలను సంపాదించుకోవచ్చునని ఛాలెంజి చేసి, ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసిన ఘనుడు జేమ్స్ రాండి. గత 20 సంవత్సరాలుగా ఆ ఛాలెంజ్ అమలులో వున్నా ఎవ్వరూ ముందుకు రాలేదు ఈనాటి వరకు (జేమ్స్ రాండి అడ్రసు – 201 East Davie Boulevard (S.E.12th st), Fort Lauderdale, Florida-33316-1815).

మనో వైజ్ఞానిక విశ్లేషణకారుడూ, విమర్శకుడు అయిన ఎరిక్ ఫ్రామ్ గురించి రాసిన వ్యాసంలో ఆయనకు సంబంధించిన అనేక విశేషాలు తెలిపారు. ‘మానవుడికి స్వేచ్ఛ అత్యంత విలువైనది. దానిని అరికట్టే విధానలన్నీ అమానుషాలే. మానవుడు సంపూర్ణత వైపుకు ఎప్పుడూ సాగిపోవాలి. అది లక్ష్యంగా మంచి మార్గాలలో కదలాలి. స్వయంశక్తిపై మానవుడు నమ్మకం వుంచాలి. ఇదీ ఎరిక్ ఫ్రామ్ తత్వసారం’ అని వివరించారు ఇన్నయ్యగారు.

రావిపూడి వెంకటాద్రిగారి గురించి రాసిన వ్యాసంలో ‘మనకు శాస్త్రజ్ఞులు పెరుగుతున్నారు తప్ప శాస్త్రీయ వైఖరి పెరగటంలేదని, శాస్త్ర దృక్పథం పెంపొందించుకుని మూఢవిశ్వాసాలకు దూరంగా సామరస్యంతో సహజీవనం జరపాలని నేటి యువతకు రావిపూడి వెంకటాద్రి తన జీవన విధానం ద్వారా సందేశం ఇస్తున్నారని’ తెలిపారు ఇన్నయ్యగారు.

ఈ విధంగా బహుభిన్నమైన అంశాలను ఆసక్తికరంగా రచించిన ఇన్నయ్యగారి ‘మిసిమి వ్యాసాలు’ అందరూ చదివి ఆస్వాదించదగినవి.

ప్రవాసాంధ్రులు ఈ పుస్తకాన్ని ఇక్కడనుంచి ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు లేదా చదవవొచ్చు.

‘మిసిమి వ్యాసాలు’ పేజీలు 230, వెల: 125-00, ప్రతులకు – నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.

పుస్తక పరిచయం: అబద్ధాల వేట – నిజాల బాట

February 1, 2012

నరిసెట్టి ఇన్నయ్య రచించిన వ్యాస సంకలనం అబద్ధాల వేట – నిజాలబాట 2005లో ప్రచురణయ్యింది. దానికి కొత్తగా డార్విన్, ప్రేమానంద్, రత్నసభాపతి, లచ్చన్న మీద వివరణాత్మక వ్యాసాలు చేర్చి, ఇప్పుడు ఇ-పుస్తకంగా వెలువడింది. ఈ పుస్తకం గురించి వెనిగెళ్ళ వెంకటరత్నం గారి పుస్తక సమీక్ష.

ఇన్నయ్య చిన్న వ్యాసం రాసినా, పెద్ద వ్యాసం రాసినా దాన్ని తన కోణంలో విశ్లేషించి, చీల్చి చెండాడుతాడు. ఎదుటి వాళ్ళు ఎంతటి వాళ్ళయినా నిజాన్ని నిర్భయంగా చెప్పగలగటం, గట్టిగా బల్లగుద్ది చెప్పటం ఇన్నయ్య ప్రత్యేకత. ఈయన కొరడా దెబ్బలు తగిన వాళ్ళలో వివేకానంద, ప్రకాశం పంతులు, మహాత్మాగాంధీ లాంటి ప్రముఖులున్నారు. ఈ సంపుటిలో చాలా లోతుగా బాబాలు, ‘అంబేద్కర్ ను అంతం చేస్తున్నారు – ఆపగలరా’ ‘ఎమ్. ఎన్. రాయ్ ఇలా చేశాడా’, ‘హిందూ నెపోలియన్ వివేకానంద’, ‘ఏది సత్యం’ గాంధీగారు వ్యాసాలతో పాటు ఎ.జి.కె., జర్నలిస్టు చింతామణి, డి.ఆంజనేయులు, గోరాశాస్త్రిలాంటి వాళ్ళ జీవిత చిత్రణలు ఉన్నాయి. ఇంకా కొన్ని సైన్సు సంగతులు, యోగా, హోమియోపతి, జ్యోతిష్యం గురించి ఉన్నాయి. సైంటిఫిక్ దృక్పథాన్ని ప్రేమించే వాళ్లంతా ఈ వ్యాసాలు తప్పక చదవాలి. చివరకు వెంకటేశ్వర సుప్రభాతం తెలుగులో ఎందుకు పాడరని అందులోని శృంగారాన్ని ఎత్తి చూపారు. అంటే దేవుణ్ణి సైతం వదలలేదన్నమాట. నేను ఏర్పరచుకున్న పేజీల నిడివి దృష్ట్యా కొన్ని వ్యాసాలలో ముఖ్యమైన విషయాలు విశదీకరిస్తాను. ప్రతీ వ్యాసంలో కొత్తదనంతో కూడిన భోగట్టా వుంటుంది. ఎవరి అభిరుచులను బట్టి వాళ్ళు ఆ వ్యాసాలు ఆస్వాదించవచ్చు. ఈ పుస్తకంలోని వ్యాసాలు పాఠకులకు నచ్చుతాయనే నమ్మకం నాకుంది. మనకు తెలియకుండా నిత్య జీవితంలో మూఢనమ్మకాల వైపు మొగ్గుతున్నాం. అది కాస్త తగ్గినా మనలో మార్పు కనబడుతుంది.

మొదటి వ్యాసం
మొదటి వ్యాసం – దివ్యశక్తుల మీద. ‘వినాయకుడు పాలు తాగుతున్నాడు’, ‘బాబా పటం నుంచి విభూది పడుతుందని’ ప్రచారం చేసి వాటికి దైవత్వం ఆపాదించి డబ్బు చేసుకోవటం మనందరికీ తెలిసిందే. అలాంటి మహిమలున్నవని నిరూపిస్తే ఒక మిలియన్ డాలర్లు గెలుచుకోవచ్చని జేమ్స్ రాండీ (అమెరికా) ప్రకటించి చాలా కాలమయింది. ఏ దివ్యశక్తులూ యిప్పటివరకూ ఎవరూ నిరూపించలేదు. ఫిలిప్పైన్స్ లో సైకిక్ సర్జరీ పేరుతో జరుగుతున్న మోసాలను రాండీ ఎండగట్టి వాటికి తెరదించారు. ఫెయిత్ ఫీలింగ్ పేరిట జరుగుతున్న మోసాలను బాహాటంగా విమర్శించారు. ప్రపంచ ప్రళయం వస్తుందని పవిత్ర గ్రంథాలలో అన్ని మతాలూ పేర్కొని జనాల్ని బెంబేలెత్తిస్తున్నాయి. అలాంటివాటిలో ముఖ్యమైన 49 ప్రళయ జోస్యాలను జేమ్స్ రాండీ తేదీలతో సహా ప్రచురించాడు. వీటిలో ఏ ఒక్కటీ నిజం కాలేదు. మన దేశంలో ప్రేమానంద్ ఇలాంటి అసత్య ప్రచారాలను నిగ్గుతేల్చాడు.

పేరా సైకాలజీ
పేరా సైకాలజీ పేరిట జరిగిన మోసాలు – మనో శక్తితో వివిధ వస్తువులను ప్రభావితం చేయటం (చెంచాలను వంచటం లాంటివి. మహేష్ యోగి గాలిలో తేలటం లాంటివి మోసమని ఆయన శిష్యులు అమెరికాలో కోర్టులో కేసు వేయగా దాన్ని కోర్టులో ఎదుర్కొనలేక బయట పరిష్కరించుకుని బయట పడ్డాడు. ప్రార్థనలతో జబ్బులు నయమవుతాయని, పిల్లల ప్రాణాలు పోగొట్టుకున్న తల్లిదండ్రులు అమెరికాలో ఎంతోమంది ఉన్నారంటే నమ్ముతారా? ఇవన్నీ మోసపూరితమని రాండీ తన వ్యాసాల ద్వారా ఉపన్యాసాల ద్వారా తేటతెల్లం చేశాడు.

బాబా ఏమైనా చేయగలడు
సత్యసాయిబాబా చనిపోయిన తరవాత ఆయన అపార సంపద బయట పడింది. బాబాలు భక్తులను ఆధ్యాత్మిక చింతన వైపు మళ్ళించాల్సింది పోయి ఆదాయం మీద ఆసక్తి చూపటం విడ్డూరం. దత్తభగవానుని హైదరాబాదులో అరెస్టు చేశారు. కాళీబాబా ఆశ్రమంపై బాంబులు పడ్డాయి. ‘బాబా ఏమైనా చేయగలడు’ వ్యాసంలో టెంకాయ భక్తి, బాబా దర్శనం, బట్టలు తగలబడుతున్నాయి, క్రీస్తు మహిమలు, చిట్కాలతో చంపుతాననడం లాంటి ఆసక్తికర విషయాలు ఎన్నో ఉన్నాయి. సత్యసాయి ఆశ్రమం పుట్టపర్తిలో నాలుగు హత్యలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఆశ్రమాలున్నాయి, వారి స్థిరాస్తులేమిటి అనే లెక్క తీయవలసిందిగా ‘బాబాలు–ఆశ్రమాలు’ వ్యాసంలో తీవ్ర స్వరంతో పరికించారు.

అయ్యప్ప మనుషులే నీకు శరణం
కేరళలో అయ్యప్ప భక్తులను ఎన్నో ఏళ్ళుగా శబరిమల దేవాలయం జనవరి 14న కనిపించే మకరజ్యోతి దైవికమని నమ్మిస్తూ భక్తులను కుప్పతెప్పలుగా పెంచారు. నిజానికిది మానవ చర్య అని కేరళ హైకోర్టులో దేవాలయం వారు ఈ మధ్య ఒప్పుకున్నారు. దేవస్థానం వాళ్ళూ పోలీసులు, విద్యుత్ బోర్డు సహకారంతో సాయంత్రం 6.30 గంటలకి కొన్ని కిలోల కర్పూరాన్ని ఒక పాత్రలో వెలిగించి, రెండు చేతులతో, ఆ పాత్రను మూడుసార్లు ఎత్తి, కొండ వైపుకి చూపుతారు. ఈ జ్యోతి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులందరూ ఈ మంటను చూసి మకరజ్యోతిని దర్శించినట్లుగా భ్రమిస్తారు. ఈ భోగట్టా పాతికేళ్ళ క్రితమే హేతువాదిలో ‘అయ్యప్ప మనుషులే నీకు శరణం’ అని ఇన్నయ్య వ్యాసంలో వ్రాసాడు.

చిన్నపిల్లల్ని మతానికి దూరంగా ఉంచాలనేది ఇన్నయ్య గట్టి నమ్మకం. పిల్లలు పుట్టగానే తల్లిదండ్రులు అనుసరిస్తున్న మతాన్ని పిల్లలపై రుద్దుతారు. దీనివలన పిల్లలకు మతంతో ముడేసుకున్న మూఢ నమ్మకాలు, దురాచారాలు వాళ్ళ జీవితంలో భాగమై వాళ్ళ స్వేచ్ఛా చింతనను మొగ్గలోనే తుంచి వేస్తున్నాయి. చిన్నప్పుడే పిల్లల్ని గురువులుగా ఎంపిక చేసి శంకర మఠాల్లో ఆచారాలను నూరిపోస్తున్నారు. క్రైస్తవులు సైతం ఆడపిల్లల్ని నన్స్ గానూ, మగ పిల్లల్ని ఫాదరీలుగానూ మతానికి అంకితం చేసి ఆ చర్యను దైవ సేవగా పేర్కొంటూ మత గ్రంథాలు వల్లెవేయిస్తున్నారు. ఈ ఆచారాలు పిల్లల మానసిక ఎదుగుదలకు అడ్డుకట్టలు వేస్తున్నాయి. ‘పిల్లల్ని మతాచారాలకు దూరంగా వుంచండి’ అనే వ్యాసంలో పేర్కొన్నారు.

వేదాల్లో ఏముంది?
ఇక వేదాల్లో ఏముంది? అనే వ్యాసంలో ప్రాచీన కాలంలో ఎందరో ఆలోచనాపరులు (మన భాషలో రుషులు) ఆడుతూ పాడుతూ కంఠస్థం చేసినవే వేదాలు. ఇవి సంప్రదాయ బద్ధంగా, గురువునుంచి శిష్యునికి అలా… అలా… గుర్తున్నంత వరకూ ఆనోటా, యీనోటా నాని ప్రజలలోకి ప్రచారంలోకి వచ్చాయి. దీనికి మూల రచయిత ఫలానా అని చెప్పలేము. అలాంటి రచనలకు దివ్యత్వాన్ని ఆపాదించారు. ఇవి వెలుగు చూసిన కాలం నిర్ణయం కాలేదు – ఏదో ఉజ్జాయింపుగా చెప్పటమే. ప్రతిదానికీ దేవుడే కారణమని నమ్మారు అప్పటివారు. దయానందుడు సైతం కులాన్ని కాదన్నా వేదాలలోని వర్ణ వ్యవస్థకు వత్తాసు పలికాడు.వేదాలు నరబలిని అంగీకరించాయి. ఆ తరువాత వచ్చిన బ్రిటీషు పాలకులు దీనిని నిషేధించారు. వేదాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలను అగ్రవర్ణాలుగా సృష్టించాయి. శూద్రులు వారికి సేవ చేయాలన్నారు. వీరికి యజ్ఞం చేసే అర్హత లేదు. దయానందుడు ఎంత సంస్కరణ వాది అయినా శూద్రులు పితికిన పాలు కూడా అపవిత్రమన్నాడు. బ్రాహ్మణుడు శూద్ర స్త్రీలతో వ్యభిచరించవచ్చు. ఆ పని శూద్రులు బ్రాహ్మణ స్త్రీతో చేస్తే నరికేయాలన్నారు. ఇలాంటి తారతమ్యాలు జుగుప్సాహకర విషయాలు వేదాలలో ఉన్నట్లు ఈ వ్యాసంలో వివరించటం మనం చూస్తాం.

‘భారత ముస్లింలలో పునర్వికాసం ఎందుకు రాలేదు?’ అన్న వ్యాసంలో అనేక చారిత్రక విషయాలు, కాంగ్రెస్ పార్టీలో ముస్లింల పాత్ర చాలా వివరంగా వ్రాశారు. సిపాయిల తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ ఉద్యోగిగా ఉన్న సర్ సయ్యద్ తిరుగుబాటును ఖండించి ముస్లింలు బ్రిటిష్ వారికి విధేయులుగా ఉండాలన్నాడు. 1975లో ఆంగ్లో ఓరియంటల్ కళాశాల స్థాపించిన సర్ సయ్యద్ ఆధునిక విద్యను ముస్లింలలో వ్యాపింపచేయాలని, శాస్త్రీయ చరిత్ర ప్రాధాన్యత గల పుస్తకాలను అనువదించి ప్రోత్సహించడం తో ముస్లిం మత గురువుల ఆగ్రహానికి గురయ్యాడు. సైన్స్ విద్యను ముస్లింలకు దూరంగా పెట్టి వారిలో పునర్వికాసం రాకుండా, ముస్లిం ఛాందసవాదులు అడ్డుపడ్డారు. ఉత్తరోత్తరా కాంగ్రెస్ రాజకీయాలపై నమ్మకం కోల్పోయి, విద్యాధికులయిన ముస్లింలు సైతం వేర్పాటు ధోరణి అవలంబించి పాకిస్తానుగా భారత్ నుండి విడిపోయారు.

ఎమ్.ఎన్.రాయ్
హ్యూమనిస్టు ఉద్యమ నిర్మాత ఎమ్.ఎన్.రాయ్.‘ఎమ్.ఎన్.రాయ్ ఇలాచేశాడా?’ అనే వ్యాసంలో అమెరికాలో ఉన్న కాలంలో అక్కడ రాయ్ తొలి భార్య ఎవిలిన్.తో 9 ఏళ్ళు కాపరం చేసి హఠాత్తుగా విడిపోవటానికి కారణాలు, ఇండియాలో ఉన్న హ్యూమనిస్టులకు సైతం తెలియరాలేదు. ఇన్నయ్య అమెరికాలో ఉన్న కాలంలో దీనిపై సుదీర్ఘమైన పరిశోధన చేపట్టి, ఆరోజుల్లో రాయ్ ఎవిలిన్ తో సన్నిహితంగా వుండి వారికి తోడ్పడ్డవారిని గుర్తించి వారితో సంప్రదింపులు జరిపి, ఆంస్టర్‌డాం లోని ఆర్కైవ్స్ నుండి ఆధారాలు సేకరించి ఈ విషయాన్ని ‘ఎమ్.ఎన్. రాయ్ ఇలాచేశాడా?’ అనే 20 పేజీల వ్యాసంలో పేర్కొన్నాడు. ఇది రాయ్ పై మౌలిక రచన అని చెప్పక తప్పదు. దీని పూర్వాపరాలు క్షుణ్ణంగా తెలియాలంటే వ్యాసం మొత్తం చదవాల్సిందే. ఎమ్. ఎన్. రాయ్ కమ్యూనిస్టుగా పరిణమించక ముందు సంగతులు ఇందులో ఉన్నాయి. రాయ్, ఎవిలిన్ అంతర్జాతీయ రాజకీయాలలో ఎంతో ప్రాముఖ్యత వహించారు. ఎవిలిన్ అత్యంత ప్రతిభావంతురాలు. ప్రతిష్ఠాత్మక స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యం, ఫిలాసఫీ ప్రధాన కోర్సులుగా డిగ్రీ తీసుకున్నది. ‘అన్ ది క్వయట్’ అనే హాస్య నాటికలో ఆమె పోషించిన పాత్రకు పత్రికా ముఖంగా మంచి ప్రశంశలు వచ్చాయి. 1920 అక్టోబరులో తాష్కెంట్ లో స్థాపించిన భారత కమ్యూనిస్టు పార్టీలో ఎవిలెన్ సభ్యురాలు. లెనిన్ దృష్టిని సైతం ఆకర్షించిన మేథావి. మిగతా వివరాలకోసం ఈ వ్యాసం చదవండి. రాయ్ గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి.

స్వామి వివేకానంద
‘హిందూ నియంత వివేకనంద’ వ్యాసం రాయటానికి ఎంతో గుండె ధైర్యం కావాలి. వివేకానంద హిందువులందరికీ ఆరాధ్య దైవం. ఆయనపై చెణకులు విసరటం అంటే కొరివితో తల గోక్కోవటమే. 1985లో వివేకానంద పై ఉదయంలో వ్రాసిన వ్యాసంలో అంశాలను హిందూ ఛాందసవాదులు తట్టుకోలేపోయారు. వీర హిందూ యువకులు లాఠీలతో ఉదయం ఆఫీసుపై దాడికి దిగారు. నచ్చని విషయాలపై సమాధానం వ్రాయండని ఎడిటర్ ఎ.బి.కె. ప్రసాదు చెప్పినా వారు దాన్ని పట్టించుకోలేదు. మర్నాడు వివేకానందుణ్ణి ఆకాశానికెత్తుతూ ఎడిటోరియల్ వ్రాయాల్సిన దుస్థితి కలిగింది. వివేకానంద సన్యాసిగా వుంటూ జమీందారుల ఆశ్రయం స్వీకరించి వాళ్ళకి అతిథిగా ఉన్నాడు. పేదలు ఆకలితో మాడుతున్నా పట్టించుకోని జమీందారులు, వివేకానంద తల్లి, సోదరుని భృతికోసం నెలకు 100 రూపాయలు జమీందారుల నుంచి ఇప్పించటంలో కృతకృత్యుడయ్యాడు. 1890లో వందరూపాయలంటే దాని విలువ లక్షతో సమానం.

నరేంద్రుడు వివేకానందుడు ఐన వైనం
వివేకానందునికి తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్రనాథ్. రామకృష్ణ సన్యాసం ఇచ్చిన తరువాత పెట్టిన పేరు ‘వివిశానంద’ ఆ తరువాత ఆ పేరు 1892 నాటికి ‘సచ్చిదానంద’గా మారింది. అమెరికా సర్వమత సమావేశాలకు వెళుతున్న సందర్భంలో, ఖెత్రి మహరాజు బహిరంగ దర్బారు ఏర్పాటు చేసి నరేంద్రునికి ‘వివేకానంద’ అని కొత్త పేరు పెట్టాడు. ఒక సిల్కు తలపాగా తయారు చేసి తొలుత ఇచ్చింది ఖెత్రి మహారాజే. ఉత్తరోత్తరా ఆ తలపాగా వివేకానందకు చిహ్నంగా మారింది. భారతదేశంలో మత విశ్వాసాలను సేవాభావంతో జతచేసి బోధించటం వివేకానందుని ప్రత్యేకత.

అంబేద్కర్
ఇక ‘అంబేద్కర్’ వ్యాసంలో అంటరానితనం తొలగించాలని 1917 కాంగ్రెసు మహాసభలలో ప్రతిపాదించినా అది ఇప్పటికీ ఆచరణ సాధ్యం కాలేదు. ముస్లిం మైనార్టీలలాగా అంటరానివారికి సైతం చట్టసభలలో ప్రత్యేక ప్రాతినిధ్యం ఉండాలన్న అంబేద్కర్ కోరికను అప్పటి బ్రిటిష్ పాలకులు అంగీకరించినా గాంధీజీ మాత్రం దీనికి ఆమోదం తెలుపకపోగా – ప్రత్యేక ప్రాతినిధ్యం ఉండటానికి వీలు లేదని నిరాహారదీక్ష పూనాడు. గాంధీని నెగ్గించి, అంబేద్కర్ ను ఓడించారు. ఈ ఘటన తరువాత గాంధీపట్ల జాగ్రత్తగా వుండమని అంబేద్కర్ పదే పదే హెచ్చరించాల్సి వచ్చింది. 1929లో దేవాలయాల ప్రవేశం కావాలని అంటరానివారే సత్యాగ్రహానికి పూనుకోగా గాంధీజీ వారిని ఖండించారు. దీనికి అంబేద్కర్ ఆశ్చర్యపోయాడు. హిందువులతో ఉన్నంత కాలం వారికి సమానత్వం రాదని గ్రహించి అంబేద్కర్ అప్పటి జవహర్ లాల్ మంత్రివర్గం నుంచి వైదొలగి బౌద్ధం స్వీకరించారు. అన్ని పార్టీల వాళ్ళూ ఓట్ల కోసం అంబేద్కర్ భజన చేస్తున్నారు. కానీ ఆయన ఆశించిన సమానత్వానికి పాతరేశారు. ఒక పక్క రాముడు కావాలనీ, మరో పక్క అంబేద్కరూ కావాలంటూ నేటి రాజకీయాలు నడుస్తున్నవి. రాజకీయాధికారం లేనిదే అంటరానివారికి హక్కులు దక్కవనీ, బానిసల కంటే వీరిని అధములుగా చూస్తారని అంబేద్కర్ హెచ్చరించారు.

మహాత్మా గాంధి
అలాగే ‘గాంధీ వ్యాసాలలో’ ఆయన్ని పదునైన విమర్శకు గురిచేశారు. గాంధీజీకి ఎన్నో అశాస్త్రీయ భావాలుండేవి. బీహారులో భూకంపం వస్తే – ప్రజలు పాపం చేశారు గనుక దేవుడు ఆగ్రహించాడని ప్రకటించారు. పండిత్ నెహ్రూతో సహా ఎందరో ఈ అశాస్త్రీయ ధోరణిని ఖండించారు. రవీంద్రనాథ టాగోర్ ని సిల్కు బట్టలు వదలి దేశీయ బట్టలు ధరించమంటే ఆయన నిర్మొహమాటంగా నిరాకరించారు. కేరళలో గురువాయూరు గుడిలోకి హరిజనులకు ప్రవేశం కల్పించకపోతే, ఆమరణ నిరాహార దీక్ష చేపడుతానన్న గాంధీజీ ఆమాట ఎన్నడూ పాటించలేదు.

ఛార్లెస్ డార్విన్
ఛార్లెస్ డార్విన్ వ్యాసం ఎంతో పరిశోధనతో కూడినది. ఈ వ్యాసం పాఠ్యాంశంగా వుండటానికి అర్హత కలిగినది. డార్విన్ చిన్నప్పుడు బిళ్ళ పురుగులు, మిణుగురులు లాంటి సూక్ష్మ క్రిములపై ప్రయోగాలు చేసేవాడు. కేంబ్రిడ్జ్ లో మతం అంశంగా డిగ్రీ పొందాలని డార్విన్ మొదట అనుకున్నా వృక్షశాస్త్రజ్ఞుడు హెన్ స్లోతో పరిచయం వలన మొక్కలను అధ్యయనం చేసాడు. బైబుల్ అంతా పవిత్రమని ప్రతి అక్షరం వాస్తవమని డార్విన్ నమ్మకం. ఆ తరువాత ఫిజ్ రాయ్ అనే నౌకాధిపతితో వీగల్ ఓడలో ప్రయాణం కట్టి ఐదేళ్ళు ప్రకృతిని అధ్యయనం చేస్తూ గడిపాడు. ఓడ బయలుదేరిన రెండో రోజే డార్విన్ సముద్ర జ్వరంతో బాధపడ్డాడు. ఓడ ఆగినచోట కీటకాలు, కొత్తరకం పువ్వులు, సముద్ర జీవుల్ని సేకరించి, వాటి గురించి వివరణాత్మక నోట్సు రాసుకున్నాడు. ఈ నోట్సు ఆధారంగా పక్షులు, మొక్కలు, జంతువులు, ప్రకృతిననుసరించి మారుతాయని డార్విన్ గ్రహించాడు. అప్పటి వరకూ సృష్టివాదం ప్రబలంగా వుంది. డార్విన్ పరిశీలన వల్ల అన్నీ పరిణామం చెందాయని తెలిసింది. నెమ్మదిగా మార్పులు, చేర్పులు జరుగుతూ పరిణామ సిద్ధాంతం రూపొందింది. అది మొక్కలకు పక్షులకు జంతువులకు చివరికి మనుషులకు వర్తిస్తుంది. అంతేగాని హఠాత్తుగా సృష్టి జరగలేదు.

రత్నసభాపతి
రత్ససభాపతి ఇన్నయ్యకు అనేక సంవత్సరాలుగా స్నేహితుడే కాక వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా వుండేవారు. రత్నసభాపతి రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఇన్నయ్యకు బాగా తెలుసు. ఎమ్.ఎల్.ఎ.గా వుండగా హైదరాబాదులో తరచు కలుస్తుండేవారు. భూస్వామి కుటుంబం నుంచి వచ్చిన రత్నసభాపతి ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఎ. చదువుతుండగా రాజకీయాలపై ఆసక్తి కలిగింది. సోషలిస్టుగా రాజకీయాలు ప్రారంభించాడు. సోషలిస్టుగా డా.లోహియాతో సన్నిహితంగా వుండేవాడు. భూదానోద్యమ కర్త వినోబాభావే కడప జిల్లాలో పర్యటిస్తుండగా ఆయనతో ఢీకొన్నారు. చివరికిది జయప్రకాష్ దాకా వెళ్ళింది. హైదరాబాదులో సోషలిస్టు పత్రిక మేన్ కైండ్ పత్రికలో రచనలు చేశాడు. రత్నసభాపతి కాంగ్రెసులో చేరాడన్న వార్త విన్నాక నాకు మానవులపై నమ్మకం సడలిందని లోహియా మేన్ కైండ్ లో రాశాడు. 1955లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పి.ఎస్.పి. అభ్యర్థిగా బద్వేల్ నుండి అత్యధిక మెజార్టీతో గెలిచి శాసన సభలో ప్రవేశించాడు. 1967 నుంచి అసెంబ్లీలో రత్నసభాపతి ప్రతిపక్ష నాయకుడుగా బ్రహ్మానందరెడ్డి వర్గంపై ధ్వజమెత్తాడు.1969లో జరిగిన తెలంగాణా ఉద్యమాన్ని సమర్ధిస్తూ రాష్ట్రాన్ని చీల్చమని రత్నసభాపతి ఉపన్యాసాల్లో చెప్పాడు. అలాగే 1973లో జరిగిన ప్రత్యేకాంధ్ర ఉద్యమంలోనూ రాష్ట్రాన్ని చీల్చమని తన అభిప్రాయాన్ని మరోసారి చెప్పారు. సభాపతి 20 ఏళ్ళుగా శాసన సభలోనూ బయటా ప్రతిపక్ష విమర్శకుడుగా రాణించాడు. ఆంధ్ర్రప్రదేశ్ సహకార భూమి తనఖా బ్యాంకుకి కొన్నాళ్ళు అధ్యక్షులుగా ఉన్నాడు.

లచ్చన్న
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో లచ్చన్న కాకలుతీరిన యోధులు. సుదీర్ఘమైన రాజకీయ జీవితం దాదాపు అన్ని పార్టీలలో ఉన్న అనుభవం, రంగా నమ్మిన బంటుగా లచ్చన్న తెలుగువారందరికీ సుపరిచితులే. 1909లో శ్రీకాకుళం జిల్లా సోంపేట తాలూకా బారువా గ్రామంలో లచ్చన్న జన్మించాడు. ఆర్థికంగా మామూలు కుటుంబం. చదివింది ఎస్.ఎస్.ఎల్.సి. తొలుత కాంగ్రెసులోనూ ఆ తరువాత ప్రజా సోషలిస్టు పార్టీ, స్వతంత్ర పార్టీలలో పనిచేశాడు. ఉప్పు సత్యాగ్రహంలో జైలుపాలయ్యాడు. లచ్చన్న పటిమగల కార్మిక నాయకుడు. విశాఖపట్టణంలో సింధియా నౌకా నిర్మాణ కార్మికులకు నాయకులుగా లచ్చన్న మేలైన సేవలందించాడు. కార్మికులు సమ్మెకారణంగా నష్టాల ఊబిలో కూరుకున్న సంస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలాగా లచ్చన్న చేసిన కృషి నెరవేరింది.సింధియా సంస్థలో కార్మికులకు అప్పటి వరకూ స్కేళ్ళు, గ్రేడులు లేవు. వీరి కనీస కోర్కెల పత్రాలను తయారు చేసి, యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు. అయినా వాళ్ళు లొంగి రాకపోయేసరికి సమ్మె ప్రకటించారు. సమ్మె జయప్రదం కావటానికి ఉద్యోగులనందరినీ వారి వారి ఇళ్లకు పంపించేసారు. కార్యకర్తలు మాత్రమే విశాఖలో మిగిలారు. సమ్మె మూడు మాసాలపాటు జరిగిన అనంతరం యాజమాన్యం లొంగి బొంబాయిలో గల కేంద్ర కార్యాలయానికి లచ్చన్నను ఆహ్వానించారు. యూనియన్ కార్యకర్తలందరినీ ఆహ్వానిస్తే తప్ప రానని లచ్చన్న భీష్మించాడు. యాజమాన్యం చేసేది లేక అందరినీ ఆహ్వానించి యూనియన్ కోర్కెలు ఆమోదిస్తూ రాజీ పడ్డారు. అది 1948 జనవరి 30న ఉదయం జరిగింది. సాయంత్రం గాంధీజీ హత్య కావటం అందరినీ దిగ్ర్భాంతికి గురి చేసింది. సింధియావారు ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో లచ్చన్న ఢిల్లీ వెళ్ళి, గాంధీ అంత్యక్రియలకు హాజరయ్యారు. రంగాగారి అనుచరుడుగా లచ్చన్న రాజకీయ విశేషాలు గల ఈ వ్యాసం ఎంతో ఆసక్తికరంగా సాగింది. లచ్చన్నతో వ్యక్తిగత పరిచయం ఈ రచనకు ఎంతో ఉపయోగపడింది.

ఇంకా పలువురి జీవిత చిత్రణలు, సైన్స్ సంగతులు, పుస్తక పరిచయాలతో నిండిన ఈ పుస్తకం ఆసాంతం ఆసక్తిగా చదివిస్తుంది.

ప్రధమ ప్రచురణ: 2005
ధర: రూ.150/-
Rationalist Voice Publications, Secunderabad వారి ప్రచురణ.
అదనపు వ్యాసాలతో కలిసి ఇ-పుస్తకం: 2012

ఈ పుస్తకాన్ని ఇక్కడ నుంచి దిగుమతి చేసుకోండి.