Posts Tagged ‘Book Inaguration’

కథాకదంబం: పుస్తకావిష్కరణ

May 13, 2011

మంచి బాలల పుస్తకాలకు చిరునామా మంచి పుస్తకం ప్రచురణలు, తార్నాక, సికందరాబాదు. గతనెల ఏప్రిల్ 29న వీరి అమ్ములపొదిలో చేరింది మరో బాలల మంచి పుస్తకం. అదే 50 కార్డు కథల కథాకదంబం. ప్రతి కార్డు లోను ఒకటి లేక రెండు కథలు, ఆకర్షణీయమైన రంగుల చిత్రాలతో సహా. ఈ బొమ్మల కథలు పిల్లలకు ఉపయుక్తంగా ఉన్నాయి.

వేసవి సాయంత్రం, బంజారా కొండలలోని, సప్తపర్ణి ఆరుబయటి రంగస్థలిలో జరిగిన పుస్తకావిష్కరణ సమావేశానికి ప్రఖ్యాత టి.వి. యాంకర్ ఝాన్సి యాంకర్ గా కార్యక్రమ నిర్వహణ చేశారు.

సప్తపర్ణి అధినేత్రి అనురాధ, ఆంధ్ర మహిళా సభ పిల్లల ప్రాతః విద్యా శాఖ గౌరవ అధ్యక్షులు డా.కె.లక్ష్మి గార్ల కరకమలాల ద్వార కధాకదంబం ఆవిష్కరించబడ్డది.

డా.కె.లక్ష్మి మాటాడుతూ ” పిల్లల అవసరాలకు ఉపయోగపడేలా తగిన వనరుల నిర్మాణానికి సరైన ప్రోత్సాహం లభించటం లేదు. పిల్లల జీవితంలో మొదటి 8 సంవత్సరాలు కీలకమైనవి. అప్పటి పునాదే వారి జీవితంలో భాషా నైపుణ్యం, ఆలోచనాసక్తి, పరిశీలన, చిన్న చిన్న చిక్కులకు పరిష్కారం మొదలగు శక్తులను ప్రోదిచేస్తాయి. బాలసాహిత్యం వినోదం, విజ్ఞానం పిల్లలకిస్తాయి.” అన్నారు.

విధ్యార్ధిని చరిత కధాకదంబంలోని “ఢిక్కీ ఢిక్కీ” కథ చదివిన తరువాత డా.స్వర్ణ నాయక్ మాట్లాడుతూ ” కథలు పిల్లల జీవితంలో ఎంతో ప్రభావాన్ని కలుగ చేస్తాయి. ఈ యాంత్రిక జీవనంలో తల్లి తండ్రులు పిల్లలకు కథలు వినిపించలేకపోతున్నారు. కధలవల్ల పిల్లల కాల్పనికశక్తి పెరుగుతుంది.” అన్నారు.

తదుపరి మరో విద్యార్దిని తొలకరి చినుకు (విద్యార్దిని పేరు) మిఠాయి వాసన, డబ్బుల చప్పుడు అనే కధ చదివి వినిపించింది.ఇంతకీ ఈ కధ ఏమిటి? సోమశర్మ చాలా అమాయకుడు, పేదవాడు. ఒకసారి సోమశర్మ పట్నం వెళ్లాడు. అక్కడ ఒక మిఠాయి అంగడిని చూశాడు. ఆ అంగడిలో అరిశలు, జిలేబీలు, లడ్డులు అమ్ముతున్నారు. సోమశర్మకు నోరూరింది. వాటిని చూస్తూ నిలబడ్డాడు. సోమశర్మ ను చూసి అంగడి అతను “నువ్వు ఎవరివి? తేరగా మా వంటకాల వాసన చూస్తున్నావా? మర్యాదగా డబ్బు కట్టు.” అని గద్దించాడు. ఆ మాటకు సోమశర్మ బిత్తరపోయాడు. ఇంతలో మర్యాదరామన్న అక్కడికి వచ్చాడు. సంగతి విని “నువ్వు అడిగింది న్యాయమే. అయితే సోమశర్మ పేదవాడు కదా ! అతని బాకీ నేను తీరుస్తాను.” అన్నాడు. అంగడి అతను ఆనందంగా ఒప్పుకొన్నాడు. మర్యాదరామన్న డబ్బుల సంచీ తీసి అంగడి అతని చెవి దగ్గర గలగలలాడించాడు. “సోమశర్మ వంటకాల వాసన పీల్చాడు. అందుకు నీకు బాకీ పడ్డాడు. నువ్వు నా డబ్బుల చప్పుడు విన్నావు. కదా! ఇక నీ బాకీ తీరిపోయింది.” అన్నాడు రామన్న. అంగడి అతను సిగ్గుతో తలవంచుకున్నాడు.

డా.రామచంద్రరావు మాట్లాడుతూ ” ప్రఖ్యాత రచయిత గోర్కీ అంటాడు” జీవితమంటే తెలిసే సరికి జీవితం అయిపోతుంది.” కాలం విలువైనది. మానవుడిని జంతువులనుంచి వేరుచేసేది అతని సృజనశక్తి. సమస్యలుంటేనే పరిష్కారానికి కావల్సిన తెలివితేటలు వస్తాయి. పిల్లల ఊహకు తగిన వాతావరణమిస్తే వారి మేధాశక్తి పెరుగుతుంది.” అన్నారు.

తరువాత ఈ కధలకు అందంగా బొమ్మలు వేసిన పావని తమ అనుభవాలు వివరించారు.

తరువాత మంచిపుస్తకం తరఫున భాగ్యలక్ష్మి మట్లాడుతూ ఒక తమిళ పుస్తకం ఈ పుస్తక ప్రచురణకు ప్రేరణ ఇచ్చిందని, ఇంకా ఈ పుస్తక ప్రచురణ వెనుక ఉన్న విశేషాల గురించి వివరించారు. కధాకదంబం అందంగా రావటానికి తోడ్పడిన చిత్రకారిణి పావని, అందంగా పేజీ రూపకల్పన చేసిన చరిత ఇంప్రెషన్స్ భాగ్యలక్ష్మి కి ధన్యవాదాలు తెలిపారు.

యాంకర్ ఝాన్సీ మాట్లాడుతూ ఇట్లాంటి పుస్తకాలు వెలుగులోకి రావటానికి అందరూ కృషి చేస్తే, అవి బాలల మనోవికాసానికి తోడ్పడతాయన్నారు. చివరన మంచిపుస్తకం తరఫున సురేష్ వందన సమర్పణ చేశారు.