Posts Tagged ‘Best Story’

రూపాయి చెట్టు (కథా సంపుటం): ఆరో అల్లుడు (చిన్న కథ) – సలీం

June 5, 2019

ఇప్పుడు పరిచయం చేస్తున్న సలీం కథ “ఆరో అల్లుడు”, బెంగళూరు విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన “ప్రపంచ ఉత్తమ కథలు” సంపుటం లో, ఎంపిక చేసిన కథలలో ఒకటి. సలీం, పరిచయం అక్కరలేని పేరున్న రచయిత. వారి కథలు సలీం కథలుగా దూరదర్శన్ లో ధారావాహికంగా వచ్చాయి. 2010 సంవత్సరంలో సలీం నవల “కాలుతున్న పూలతోట” కు కేంద్ర సాహిత్య అకాడెమి వారి పురస్కారం లభించింది. వీరి కథలు, నవలలు పెక్కు భాషలలోకి అనువాదమయ్యాయి.

కథ జీవితాన్ని అనుసరిస్తుంది. కొన్నిసార్లు జీవితం కథలోలా మలుపులు తిరుగుతూ సాగుతుంది. ఈ కథ హైదరాబాదు నగరంలోని పాతబస్తి జీవితానికి అద్దం పడుతుంది. ఖాన్ పాతబస్తీలో, వాచ్‌మన్ గా పనిచేస్తూ, తనకొచ్చే 2000 రూపాయలతో 10 మంది కడుపు నింపాలి. ఖాన్ కు ఐదుగురు ఆడపిల్లలు, ముగ్గురు మొగ పిల్లలు వున్నారు. జీవనం సాగించటానికే ఎన్నో అవస్థలు పడే ఖాన్, ఆడపిల్లల పెళ్ళి ఎలా చేస్తాడు? ఇలాంటి పరిస్థితిని దళారులు తమకు అనుకూలంగా తీసుని, తమ పంజా విసురుతారు. గల్ఫ్ నుంచి వచ్చే షేక్ లు ఇచ్చే ప్రతిఫలానికి కక్కుర్తిపడి, ముక్కుపచ్చలారని ఆడపిల్లలను, వారి తండ్రి వయస్సువారికి, కొన్నిసార్లు తాత వయసువారికి కట్టపెడ్తారు. ఈ నవ వధువులు గల్ఫ్ కు వెళ్ళాక, వాళ్ళ మొగుళ్ళు, వారికి, భూలోకంలోనే నరకం చూపుతారు. లైంగిక వేధింపులకు తోడుగా, ఇంటికివచ్చిన వారి బంధు మిత్రులతో పడుకోవాలని బలవంతపెడ్తారు. చాలీచాలని అన్నం పెట్టి, చిత్రహింసల పాల్చేస్తారు.

ఖాన్ కూతురు గల్ఫ్‌కు వెళ్ళాక వుత్తరాలు లేవు. యాస్మిన్ మొగుడు నెల, నెలా పంపుతానన్న డబ్బు ఖాన్ కు అందదు. రాసిన జాబులకు ప్రత్యుత్తరం లేదు. రిజిస్టర్ తపాల పంపితే, చిరునామా సరిగా లేదని తిరిగివస్తుంది. గల్ఫ్ వెళ్ళే ప్రతి వ్యక్తినీ వేడుకుంటాడు; తన బిడ్డ యోగక్షేమాలు కనుక్కోవాలని. ఫలితం లేదు. శూన్యం లోకి చూడటం తప్ప ఖాన్ ఏం చెయ్యగలడు? ఆ తరుణంలో యాస్మిన్ నుంచి ఒక జాబు వస్తుంది, ఒకే వాక్యంతో. “అబ్బాజాన్ – మీకు ఆరో అల్లుడు ముబారక్…”. ఖాన్ కుప్పకూలిపోతాడు.

ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో మార్చ్ 2000 లో ప్రచురితమయ్యింది. ఈ కథ చదివాక 19991 లో 11 ఏళ్ళ అమీనాను, విమాన సుందరి అమృత అహ్లువాలియా, ఒక ముసలి షేక్ కబంధ హస్తాలనుంచి రక్షించిన ఉదంతం గుర్తుకు రావచ్చు. ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఈ కథ మరల మరల పునారావృతం అవుతూనే ఉంది కాబట్టి.

రూపాయి చెట్టు కథా సంపుటికి మాడభూషి రంగాచారి స్మారక పురస్కారం లభించింది. ఈ పుస్తకం కినిగె లో లభిస్తుంది. ఈ కథ దిగువ ఇచ్చిన లంకెలో వినగలరు.
https://youtu.be/UrC0U5PFgAc