Archive for the ‘Telugu Women Blog Reviews’ Category

సీ గాన పెసూనాంబ

September 8, 2008

siganapesunamba

వరూధినిగారు చెప్పేదాకా, చాక్లేట్ లాంటి బ్లాగు పెసూన పురాణం ,  అల్లరిపిల్ల సీ గాన పెసూనాంబ దేనని గుర్తించ లేక పోయాను. మరేమిటి బ్లాగు తెరిచి, టపా రాసే ఉద్దేశమే లేదన్నది?. ఇంచక్కటి బ్లాగు తనదేనని, జడ ఎగరేసి గర్వంగా చెప్పేయొచ్చు. @ సీ గాన పెసూనాంబ: మీ కామెంట్ ద్వారా మీరు, మీ బ్లాగు ఇప్పుడు నాకు, నలుగురికీ తెలిసాయి. ఏమి చదువుతున్నారు మీరు?
మీరు అల్లరిపిల్లని, ముందే ఒప్పేసుకున్నారు కాబట్టి, మీరు, మురళి రాసిన అంతు లేని కథ పై నా వ్యాఖ్య పై, ఎలాంటి తీర్పు చెప్పినా ఆమోదిస్తా.
కథా విమర్శ పై మాట్లాడుతున్నాము కాబట్టి, ప్రతి ఆదివారము నేను ఒకప్పుడు హాజరయిన రచయితల సమావేశాలు గురించి చెప్పాల్సుంటుంది. ఒక రచయిత తన కథ వినిపించగానే, తోటి రచయితలు కథలోని లోపాలను చీల్చి చెండాడేవారు. ఎన్నో మార్పులు, రచయిత కథలో చేసాక కాని అది అందరి ఆమోదం పొందేది కాదు. అలా కథలను మెరుగ్గా తీర్చిదిద్దేవాళ్లము. చిత్రకారుడు చంద్ర చిత్రకారుడే కాకుండా మంచి రచయిత కూడా. కథలకు ఎన్నో మార్పులు సూచించే వారు. ఈ కథ చర్చల గురించిన వివరాలు నా టపా రేడియో మిర్చి. ఇది చాలా హాట్ గురూ లో విపులంగా రాసాను. సమావేశాలలో పాల్గొనే రచయితలు, అప్పటికే లబ్దప్రతిష్టులు.
కథకు ఒక ప్రయోజనముండాలని నేను భావిస్తాను. అది హాస్యమైనా, ప్రయోజనంగానే భావిస్తాను. కథలో సందేశమున్నా లేక పోయినా ఫరవాలేదు. మురళీ కథ నిస్సందేహంగా, ఈ నాటి టి.వి.కార్యక్రమాల పై చక్కటి వ్యాఖ్యే. కాదనను. టి.వి. కార్యక్రమాలు బాగాలేదన్న సందేశం కథానాయకుడు రోజూ ఇంటికి ఆలస్యంగా రావటానికి కారణంగా కాకుండా వేరే విధంగా చెప్పిఉండాల్సుంది. మీరే చెప్పారు కదా, ఇష్టం లేని టి.వి. కార్యక్రమాల బాధ పడ లేక, “చదువుకునే రోజుల్లో, డాబా పైన కూర్చుని చదువుకునే దాన్ని, ఇంట్లో టీవీ హోరు పడలేక. ” మురళీ కథపై వ్యాఖ్యలో, నేను చెప్పిందే మీరు చెప్పారు. మనిద్దరిదీ ఒకటే అభిప్రాయం.

budugu
పెసూన పురాణం చదవని వారికోసం, ఇందు లోంచి కొన్ని రత్నాలు. సీ గాన పెసూనాంబ ఉవాచ.
“ఆనాటి పురాణాలే నేటి బ్లాగులని, నాచే ఈ సృష్టి ఆదియందు చెప్పబడియున్నది!!!”
కొన్ని ముత్యాల్లంటి మాటలు.
“మా ఊళ్ళో చాలా పేద్ద గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారంట నాకు లాగా.,
భారతమో ఎదో రాసాడంట నన్నయ్య .., కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఇలా చాలా మందే పుట్టారు మా ఊళ్ళో..,”
సీ గాన పెసూనాంబ కు ఏంటంటే ఇష్టం? రెండు జడలు, బుడుగు తో కలిసి అల్లరి చెయ్యడం. ఈ పిల్ల అల్లరెక్కువయితే ఏమి చేస్తారు?
బుడుగుకు చెప్పండి. కొన్నిసార్లు బుడుగు కూడా పెసూనాంబ పని పడ్తాడు.

Paintings Courtesy: Bapu

ఊహలన్నీ ఊసులై: సమీక్ష ముగింపు

June 18, 2008

Deavudibhramaloa

నమ్మకాలను, విశ్వాసాలను గుడ్డిగా నమ్మేస్తూ, ప్రశ్నించకుండా వుంటే, మానవాళి నేడు ఈ అభ్యున్నతి సాధించగలిగేదా? ఉదాహరణకు చంద్రుడు దేవుడని, ఆ గ్రహం పై కాలు పెట్టడం మహా పాపమని భావిస్తే, మానవుడి అంతరిక్షయానానికి అవరోధం కలిగేది కాదా? నిజానిజాలు గ్రహించక నమ్మడం పొరపాటు అనీను, ప్రశ్నించకుండా దేనినీ ఒప్పుకోకూడదనే తన అభిప్రాయాన్ని పూర్ణిమ టపా ప్రశ్నాతీతాలేవి?? లో చూడవచ్చు.

దిగజారుతున్న నేటి సినీ సాహిత్య ప్రమాణాలపై ఒక చురక “చూడడం పాపమైతే … వినడం తప్పు కాదా??” అన్న తన టపా లో కనపడుతుంది.

తెలుగు బ్లాగులు ఎందుకు చదవాలి అంటే..” అంటూ తెలుగుపై తనకున్న మక్కువ గురించి వెళ్లడిస్తూ, “మనము చదవకుండా వుండ లేము. చదివినాకా ఆలొచిస్తాము. ఆలొచిస్తే ఏమొస్తుంది? కొత్త ఐడియాలు. అవి కాగితం మీద పెట్టే దాకా నిదుర రమ్మన్న రాదు. ఇది ఒక cycle.” అని చెప్పిన మాటలు మిమ్ములని ఆలోచింపచేస్తాయి. మీ ఆలొచన కూడా అలాగే వుందా? అలాగా వుండేట్లు గా రాయటం పూర్ణిమ కు వెన్నతో పెట్టిన కలం బలం.

కొత్తగా బ్లాగులు కాని కథలు రాసే వారు కాని తెలుసుకోవలసిన ఒక ముఖ్య సూత్రం ఒకటుంది. అది కథను మొదటి వాక్యం లేదా పారాలోనే పాఠకుడిని ఆకట్టుకునేలా వుండాలి. ఉదాహరణకు ఒక కథను ఇలా మొదలెట్టండి ‘సీత సాయంత్రం తన గదికి రమ్మంది.’ ఎందుకు అని కిరణ్ ఆలోచన లో పడ్డాడు. ఇది పాఠకుడిని ఆకర్షించి, కథను తుదికంటా చదివేలా చేస్తుంది. ఆటలంటే ఇష్టం లేని వారిని కూడా పూర్ణిమ తన వ్యాస ఎత్తుగడతో పాఠకుడిని ఆకర్షించి, చదివించేలా చేస్తుంది.ఉదాహరణగా కాలమతి, ఫ్రమ్ రష్యా!!‘నే తీసుకుందాము. వ్యాసం ఆకర్షణీయమైన ఒక నీతి కథ తో మొదలెట్టి, టెన్నిస్ స్టార్ దినారా సఫీనా ఆట ఆడిన విధానంలోకి, మనలను తీసుకెళ్లిన విధానం అబ్బురపరుస్తుంది.

క్రికెట్ ఆటలో లక్ష్మణ్ ఆట తీరుపై వ్యాఖ్యానిస్తూ,అనగనగా ఒక ఈడెన్ గార్డెన్స్ .. అనే టపాలో “క్రికెట్ గ్రౌండ్ అనే Canvas మీద గీసిన Monalisa..ఆ మాచ్ లో లక్ష్మణ్ ఆడిన ఇన్నింగ్స్!! మొనాలిసా.ఎందుకో తెలుసా.. అందులో అట్టహాసం ఉండదు, అందం తప్ప. ఆ నవ్వు అన్వయించుకునే వారి బట్టి దాని అందం పెరుగుతుంది. సింపుల్ గానే అనిపిస్తుంది… అర్దం చేసుకునే కొద్దీ complexities బయటకి వస్తాయి, ఇది అతని ఆటతీరు మాత్రమే. Optimism కి మనిషి రూపం ఇస్తే అతడే. మాటలో ఎంత మృదుత్వమో.. ఆటలో అంత Sharpness. ఆ మాచ్ లో ద్రావిడ్, భజ్జీలది చాలా ముఖ్యపాత్ర.. కానీ లక్ష్మణ్ has stolen the show.” క్రికెట్ ఆటలో లక్ష్మణ్ ఆట తీరును, కాన్వాస్ పై మోనాలిసా తో పోల్చిన, పూర్ణిమ ఊహ అందం గా ఉంది కదూ.

మరి పూర్ణిమ యువ హృదయ గుండె చప్పుడు కవితలో కాక మరే ఇతర మాధ్యమం లో బాగా వ్యక్తం కాగలదు? ఆమె గుండె చప్పుడు స్వాతి చినుకు లో వినవచ్చు.

అన్నం ఉడికిందా లేదా అని తెలియటానికి అన్నమంతా తిననవసరం లేనట్లే, ఈ కొద్ది వ్యాసాల పరిచయం, పూర్ణిమ రచనా పాటవత్వాన్ని మీకు తెలియచేస్తాయి. ఆమె రాసిన పూర్తి వ్యాసాల చిట్టా నేను ఇవ్వబోవటం లేదు. పూర్ణిమ బ్లాగుకు వెళ్లి ఆ వ్యాసాలను మీరే చూడండి.అవి మిమ్ములను సంతృప్తి పరుస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు. సులువైన వచనం, కవితలు ఇంకా ఆంగ్ల బ్లాగు, ఈ మూడు ప్రక్రియలలో అలవోకగా రాస్తూ, పాఠకుల మెప్పు పొందిన పూర్ణిమ, తెలుగు మహిళా బ్లాగరులలో విశిష్ట స్థానం సంపాదించుకున్నది.

చివరి మాట: మంచి తేనె పనస లాంటి బ్లాగు

ఊహలన్నీ ఊసులై: సమీక్ష

June 17, 2008

ఈ బ్లాగును ఈ రోజే (జూన్ 6) న యాదృచ్ఛికంగా చూడటం జరిగింది. తొలి చూపులోనే ఈ బ్లాగుకు చదివించే గుణం ఉందని తెలిసింది.బ్లాగువనంలో విహరించవచ్చిన ఈ రాచిలుక రంగేమిటో, రుచులేమిటో తెలుసుకుందామా?

మొదటగా ఈ బ్లాగు ఎందుకు అనే ప్రశ్నకు అందమైన సమాధానం ఈ బ్లాగు ఉప శీర్షిక (టాగ్‌లైన్) లోనే లభ్యం. ” కళ్ళాగని కాలపు అలలలో మనసు ఊహలు కొట్టుకుపోకుండా, ఈ బ్లాగులో ఊసులుగా పదిలపరచే ప్రయత్నం. కనుల తోటలో విరబూసే కలలను కలంతో ఏరుకోవాలని చిన్ని ఆశ!! “. ఈ బ్లాగ్ పుట రూపురేఖలు (టెంప్లేట్) ఒక మోస్తరు గా వున్నాయి. ఇంత చక్కటి ఊహలలో తేలియాడే పూర్ణిమ బ్లాగు తెర అమరిక (టెంప్లేట్), అందంగా రూపొందించటానికి అవకాశముంది.

ఇంకా ముందుకెళ్లే ముందు, ఈ పుత్తడి బొమ్మ, పూర్ణిమ తమ్మిరెడ్డి (బ్లాగరి) గురించి నాలుగు మాటలు.

హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా సద్యోగం.

పూర్ణిమకు ఇష్టమైన వాటి గురించి పూర్ణిమ మాటలలో:

ఇష్టమైన తెలుగు పుస్తకాలు: నాకు తెలుగు కాస్తో కూస్తో రావటానికి కారణం మొదట నా పాఠ్య పుస్తకాలు ఐతే.. తర్వాత ఈనాడు ఆదివారం, చందమామ. తర్వాత తెలుగు పుస్తకాలు బాగానే చదివాను. గోపిచంద్ గారంటే ప్రత్యేకమైన అభిమానం. వారు రాసిన “మాకు ఉన్నాయి స్వగతాలు”, ప్రాణం లేని వాటికి కూడా మనసుందని ఊహించుకునే అలవాటు నేర్పింది. స్వగతాలు రాయటమంటే నాకు చాల ఇష్టం. సరళమైన భాషలో మనసు స్పందించే ఏ రచనైనా ఇష్టపడతా.

godavari_at_papikomdalu

పాపికొండలలో వంపులు తిరుగుతూ, వయ్యారి గోదారమ్మ

నచ్చిన ప్రదేశాలు: గోదావరి నది, పరిసర ప్రాంతాలు.
వారాంతం: నేను చాలా నిద్రపోతుని. 🙂 నాకు నచ్చినంత సేపు నిద్రపోయాక.. చాలానే చేస్తాను. పుస్తకాలు చదువుతూ, ఆటలు చూస్తూ, వంట చెస్తూ, పాటలు వింటూ..ఆ క్షణంలో ఏమి చెయ్యాలి అనిపిస్తే అది.
సంగీతం: స్వరాలు, రాగాలు, గమకాలు ఏవీ నాకు తెలీదు, అర్ధం కావు. భావం ఒక్కటే ముఖ్యం నాకు. మనసును లాలించి, ఊరించి, మైమరపించే ఏ పాటైనా ఓ.కే.
తెలుగు బ్లాగుల పరిచయం: గూగుల్ లో ఏదో వెతుకుతుంటే.. కూడలి కనపడింది. కానీ చాల రోజుల వరకు బ్లాగులు రాసే సౌకర్యం కలగలేదు.
జీవితం లో వెంటాడే జ్ఞాపకం: ఉత్తరాలు రాయటమంటే చాల ఇష్టం నాకు. నా స్నేహితులతో ఎక్కువ వరకు.. ఉత్తరాలతోనే రాయభారం. కానీ ఇప్పుడది అసంభవం గా మారిపోయింది. 😦 “నువ్వు రాసిన ఉత్తరం ఇప్పటికీ చదువుతుంటాను తెలుసా” అని మా వాళ్ళు అంటుంటే..ఆ ఉత్తరం రాసినప్పటి జ్ఞాపకం భలే వెంటాడుతుంది.

తాను ఇతరులకు అంత సులభంగా అర్థం కాననీ, తనని అర్థం చేసుకునే వృధా ప్రయత్నం చేయవద్దంటున్నది.తన పుత్తలికైన, రాతలు చదివి ఆనందించమంటున్నది.

Impressions అనే ఆంగ్ల బ్లాగు కూడా ఉందీమెకు.

పూర్ణిమ రచనలలో వ్యంగం, సున్నితంగా కనబడుతుంది. అల్లరి చేసే స్కూల్ పిల్లలను , పార్లమెంట్ సభా వ్యవహారాలు సవ్యంగా జరగకుండా అడ్డుపడే పార్లమెంట్ సభ్యులను, పోల్చకనే పోల్చి వారిపై చక్కటి చురక వేయటం ఉంది. చూడండి No talking.. absolute silence please!!

Parakeet

చిలక జోస్యం నిజమవుతుందా!

ఎన్నో జామిపండ్లలో ఏది రుచికరమైనదో, ఎలా తెలుసుకోవచ్చో, తెలుసా? చిలక కొరికిన జాంపండు కంటే రుచికరమైనది మరేముంటుంది? మనకు జ్యోతిష్యం చెప్పే చిలకకు, తన భవిష్యత్ ఏమిటో తెలుసా? ఈ చిలక పలుకులపై పూర్ణిమ విశ్లేషణ మిమ్ములను ఆకట్టుకుంటుంది.

కాశీ లోని,గంగ నీరు పవిత్రమైతే, అవి తాగితే అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?మితిమీరిన కాలుష్యం వలన గంగనీరు కూడా కలుషితమయ్యింది.గంగ మునగండి; కాని నీరు సేవించకండి అని అనుభవం చెప్తున్న పాఠం. జ్ఞాపకాలు గురించి చెప్తూ, పూర్ణిమ ఉవాచ “మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరాలు: జ్ఞాపకం, ఇంకోటి మరుపు. ఒకటి జీవితాన్ని ఆస్వాదించటానికి, మరోకటి ఏమి ఎదురైనా జీవితం సాగించటానికి. వీటిలో ఏది సమపాళ్ళు మించినా, మనుగడ కష్టమే!!”.

భానుమతి ఆత్మకథ “నాలో నేను” ను పరిచయం చేస్తూ ఇచ్చిన ఉదాహరణ {“ఉద్యోగం చేయడానికి చదువుకోవటం ఒక రకం, విజ్ఞానం కోసం చదవటం ఇంకో రకం, ఒక లక్ష్యంకోసం చదవటం మరో రకం. ” అన్న భానుమతి గారి సుభాషితం శిరోధార్యం.} వెంటాడే సుభాషితం. పూర్ణిమ కు ఇలా సుభాషితాలు సేకరించటం కూడా ఇష్టం. భానుమతి నట జీవితంలో తొలి అంకంలో నటి బదులు పాత్ర కనబడితే, తుది అంకంలో పాత్ర బదులు నటి ఎక్కువగా కనబడ సాగే వారు. ఆమె పాడిన శాస్త్రీయ గీతాలు, కె సర కె సరా లాంటి పాశ్చాత్య గీతాలు రెండూ బహుళ ప్రాచుర్యం పొందాయి. పూర్ణిమ పదాలకోసం తడుముకోకుండా అలవోకగా చేసిన ఈ పుస్తక పరిచయం పాఠకుల మన్నలను పొందింది.

(ఇంకా ఉంది – రాబోయే చివరి భాగంలో – తెలుగు మహిళా బ్లాగులలో ఊహలన్నీ ఊసులై ఎలాంటి స్థానం సంపాదించుకున్నది? ఈ బ్లాగు, బ్లాగు తరగతిలో, ఏ మెట్టులో ఉన్నదీ (Grading) వగైరా విశేషాలు చూడండి.)