Archive for July, 2012

ఉన్నత సంప్రదాయం – అల్ప సంప్రదాయాలు

July 24, 2012

సాంస్కృతిక మానవశాస్త్రంలో భారతీయ పరిశోధనలు

ఉన్నత సంప్రదాయం ఏది? స్వల్ప సంప్రదాయం అంటే ఏమిటి? భారత మత ఆచార వ్యవహారాలను, మత గ్రంధాలను,ఔపోసనం పట్టిన గురువు స్వామి అగేహానంద భారతి రాసిన ఒక ప్రామాణిక రచన ఉన్నత సంప్రదాయం స్వల్ప సంప్రదాయాలు అనే గ్రంధాన్ని వారణాసి లో చౌకంభ ప్రచురణలవారు వెలువరించారు. దానిని తెలుగించిన ఇన్నయ్య రచనను తెలుగు అకాడమి ప్రచురించింది.

వేదం ఉన్నత సంప్రదాయం అయితే, భారత రామాయణం, పురాణాలు, పూజలు, క్రతువులు స్వల్ప సంప్రదాయాలు గా వున్నాయి. 11అధ్యాయాలు గల ఈ రచన ఆసక్తి కరమైన అనేక సునిశిత అంశాలను విడమరిచి చెప్పింది.కర్ణాటక రాష్ట్రంలోని చిక్ మగ్లుర్ సమీపంలో కొండపై ఒక గుడిని ముస్లింలు జలందర్ షా అని, హిందువులు దత్తాత్రేయ తీర్థం అని సందర్శిస్తారు.స్వర్ణ దేవాలయంను సిక్కులు తమ పవిత్ర క్షేత్రం గా భావించి పూజ చేస్తే, టిబెట్ నుండి బౌద్ధులు అది తమ పుణ్యస్థలంగా సందర్శిస్తారు.

సామాన్యుల దృష్టిలో రామాయణ, భారతాలు పవిత్రం కాగా, పండితుల రీత్యా అవి స్వల్ప సంప్రదాయాలు. సాంస్కృతిక మానవ శాస్త్ర అధ్యయన కోణంలో అగేహానంద రచన సాగింది.సాంకేతిక పదజాలాన్ని సామాన్యులకు తెలిసే రీతిలో ఒక అధ్యాయం లో వివరించారు. సెక్యులరిజం విదేశి, స్వదేశి భావనలో ఎలా అర్థం చేసుకుంటున్నారు అనే సంగతి బాగా చెప్పారు.తన రచనను ఎం ఎన్ రాయ్ కు అంకితం ఇస్తూ, రాయ్ ను, సెక్యులర్ బ్రాహ్మణుడని కొందరు పిలవడం గమనించాలన్నారు. కాలం గురించి ఒక ప్రత్యెక అధ్యాయం రాయడాన్ని బట్టి భారతీయ సంప్రదాయంలో కాలానికి గల ప్రాముఖ్యతను గమనించాలి.సాంకేతిక పద జాలాన్ని ఎలా అర్థం చేసుకోవాలో విప్పి చెప్పారు.

ఈ పుస్తక రచయిత అసలు పేరు లూయి ఫిషర్. ఆస్ట్రియ దేశానికి చెందినా, జర్మని లో భారతీయుల పరిచయం తో రామకృష్ణ ఆశ్రమంలో చేరి, వివేకానంద రచనలు పరిష్కరించి, శంకర ఆశ్రమాలు సందర్శించి, హిందువుగా మారి, యోగాన్ని, తాంత్రిక విద్యనూ పాటించి లోతుపాతులు తెలుసుకున్నారు. ప్రపంచంలోని బౌద్ధ కేంద్రాలు పరిశీలించి, బౌద్ధాన్ని బాగా ఆకళింపు చేసుకున్నారు.

ఆయన జీవిత గాధను ప్రచురించగా భారత దేశంలో రామకృష్ణ కేంద్రం వారి అభ్యంతరం వలన నిషేధించారు. తిరిగి అమెరికాలో సవరణలతో వెలికి తెచ్చారు.1951 లో డెహ్రాడున్ లో ఎం ఎన్ రాయ్ ను కలసిన అనంతరం మానవ వాదిగా మారి, చివరి దశలో అమెరికాలోని సిరక్యుస్ విశ్వ విద్యాలయంలో మానవ సంస్కృతీ పండితుడుగా కుదురుకొని 1991 లో మరణించారు. ఆయన పుస్తకం అతి విలువైన, అరుదైన గ్రంధం. ఇన్నయ్య దీనిని సరళంగా తెనిగించారు.

ప్రధమ ప్రచురణ: 1961
తెలుగు అకాడెమి, హైదరాబాదు.
పరిష్కర్త: ఆచార్య సి.లక్ష్మన్న, సమాజ శాస్త్ర శాఖ
పేజీలు: 207
ధర: రూ.8/-
లభ్యత: కాపీలు లేవు

తెలుగువారికి ఒక సునిశిత విషయాన్ని అతి సులభంగా ఒలిచి పెట్టిన ఈ పుస్తకం e-book గా ఇక్కడ చదవవొచ్చు.

ఆంధ్రప్రదేష్ లో మానవవాద ఉద్యమం

July 9, 2012

రాడికల్ హుమనిస్ట్ పార్టి ఉద్యమం గా మారి ఆంధ్ర ప్రదేశ్ లో 1940 నుండి కీలకమైన పాత్ర వహించింది.కొద్దిమంది వ్యక్తులే వున్నా పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత నిజాం చేసారు. తెలుగులో మానవ వాద ఉద్యమంగా వాడుకలోకి వచ్చింది. ఎం.ఎన్. రాయ్ దీని స్థాపకుడు. అటు కాంగ్రెస్ ఇటు కమ్యునిస్ట్ పార్టిలు రెండవ ప్రపంచ యుద్ద కాలంలో బ్రిటిష్ వ్యతిరేక ధోరణిలో హిట్లర్ ను సైతం ఆమోదించే వరకు పోగా మానవ వాదులు నిలబడి స్వతంత్రం రావాలంటే బ్రిటన్ గెలవాలని చెప్పి చారిత్రక పాత్ర నిర్వహించారు. వారి వాదనే సరైనదని చరిత్ర రుజువు పరచింది.తెలుగు ప్రాంతంలో అబ్బూరి రామకృష్ణారావు, ఎం.వి.శాస్త్రి తో మొదలై అనేక మంది మేధావులను ఆకట్టుకున్న పార్టి,అనేక రచయితలను, ఉపన్యాసకులను రంగం లోకి దించింది. రాజకీయాలలో,సాహిత్యంలో, విమర్శలో,కళలో,చిన్న పత్రికలలో గొప్ప ఒరవడి పెట్టారు.పార్టి రాజకీయాలు తప్పు అని 1948 నాటికీ గ్రహించి ధైర్యం గా పార్టిని రద్దు చేసి పునర్వికాస ఉద్యమానికి పూనుకున్నారు.

ఆనాడు వీరందరినీ రాయిస్ట్లు అనేవారు.ప్రధాన పత్రికలూ వీరి రచనలు ప్రచురించేవారు కాదు.త్రిపురనేని గోపీచంద్,కోగంటి రాధా కృష్ణ మూర్తి, పాలగుమ్మి పద్మరాజు, ఆవుల గోపాలకృష్ణ మూర్తి, గుత్తికొండ నరహరి, పెమ్మరాజు వెంకట రావు కొత్త ఒరవడులు తొక్కారు.రాయ్ అనంతరం ఉద్యమం సన్నగిల్లి , చిన్న సభలకు,అధ్యయన శిబిరాలకు పరిమితమైంది. రావిపూడి వేంకటాద్రి, ఎన్.వి.బ్రహ్మం, సి హెచ్ రాజారెడ్డి,ఎన్.ఇన్నయ్య,సిద్దార్థ బక్ష్, ఎం.వి.రామమూర్తి, మల్లాది సుబ్బమ్మ, కొల్ల సుబ్బారావు, మొదలైన వారు మానవ వాద ఆలోచనలను యధాశక్తి నిలబెట్టే ప్రయత్నం చేసారు.బయటి రాష్ట్రాల నుండి మానవ వాద ప్రముఖులు తరచూ వచ్చి ఉద్యమానికి సహాయ పడ్డారు.నార్ల వెంకటేశ్వరరావు వంటి ప్రముఖులు ఆలస్యంగా ఉద్యమంలోకి ప్రవేశించినా తమ రచనల ద్వారా బాగా ఉపకరించారు .
.

తోలి సారి ఈ సంక్షిప్త చరిత్ర పుస్తకం గా వెలువడింది. ఈ ఉద్యమంలో పాల్గొన్న కొందరి ఫోటోలు కూడా ప్రచురించారు. కొందరు మానవ వాదుల వెబ్ సైట్ లు, బ్లాగ్ ల వివరాలిచ్చారు. ఇలాంటి రచన చేయడం వలన, ఉత్తరోత్తర వివరంగా రాయడానికి ఇన్నయ్య గారు దారి చూపారు.

ప్రధమ ప్రచురణ: May 2012
ధర: 5 రూ. పేజీలు: 65
లభ్యమయ్యే చోటు: నవోదయ బుక్ హౌస్, బడీ చౌడి, కాచిగూడా, హైదరాబాదు.

ఈ పుస్తకం ఉచిత e-book గా ఇక్కడ లభ్యమవుతుంది.