Archive for July, 2011

తెలుగు సాహిత్యంలో సంస్కరణల సంస్కారం

July 25, 2011

Innaiah amidst lovers of Telugu literature in Chicago

Innaiah speaking at the Telugu literature meeting

Photos courtesy: P. Thimmapuram, Chicago

చికాగో: తెలుగు సాహిత్యం ద్వారా సంఘ జీవనంలోకి ప్రవేశించి కలుషితం చేసిన కుల, అంటరానితనం, మహిళల పట్ల అసమానతను తిప్పి కొట్టడానికి జరిగిన ప్రయత్నాన్ని స్థాలీ పులాక న్యాయంగా వివరించారు డాక్టర్ ఎన్.ఇన్నయ్య. జులై 17న జరిగిన చికాగో తెలుగు సాహితీ మిత్రుల సమావేశంలో ఆయన సాహిత్యంలో సంస్కరణ ధోరణులపై మాట్లాడారు. బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు ద్వారా ప్రభావితం చేసిన సాహిత్యాన్ని సమీక్షించారు. వీరేశలింగం, గురజాడ తెచ్చిన సంస్కరణ ధోరణులు, కట్టమంచి నిరసించిన ప్రబంధ సాహిత్య మహిళల అంగాంగ వర్ణన గమనించాలన్నారు.త్రిపురనేని రామస్వామి చేపట్టిన సాంఘిక విప్లవాన్ని, వివాహ సంస్కరణను అభినందించారు. గూడవల్లి రామబ్రహ్మం శ్రీకారం చుట్టిన సంస్కరణ సినిమాలు గుర్తు చేసి తరువాత గోపిచంద్ రాసిన రాజకీయ కథలు, నాటకాల వలన బుర్రకథలు, స్టేజ్ డ్రామాలను మారిన తీరుని విశ్లేషించారు. అలాగే సెక్స్‌ని సైతం సైంటిఫిక్ అంశంగా మార్చిన ఆలపాటి రవీంద్రనాథ్, ఆవుల గోపాల కృష్ణమూర్తి వ్యాసోపన్యాసకుడుగా సంచలనం కలిగించిన సన్నివేశాలను చెప్పారు. అనంతరం ఇన్నయ్యకు దేవులపల్లి కృష్ణయ్య చేతుల మీదుగా ‘చికాగో సాహితీ మిత్రులు’ జ్ఞాపికను ప్రదానం చేశారు. పశ్నోత్తర కార్యక్రమంలో తుమ్మూరు రమేష్, సామా రామిరెడ్డి, రాణి చింతం పలు ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు.

Text: సోమవారం : 25/07/2011 సాక్షి దిన పత్రిక సౌజన్యం తో

అడవిగాచిన వెన్నెల

July 4, 2011

అడవిగాచిన వెన్నెల చైనా సమకాలీన సమాజానికి, కుటుంబ వ్యవస్థకు, సంక్షోభానికి దర్పణం. రచయిత్రి యుంగ్ చాంగ్ ప్రస్తుతం ఇంగ్లండ్ లో వుంటూ రాసిన ‘ Wild Swans ‘ ప్రపంచాన్ని ఆకట్టుకున్నది. చైనా నియంత మావో తో పనిచేసిన యంగ్ చాంగ్ కుటుంబం బయట ప్రపంచానికి అక్కడి తెరవెనుక వాస్తవ స్థితి ని, నిజాలను బయటపెట్టింది. అందుకే ఈ పుస్తకాన్ని చైనాలో నిషేధించారు .అయితే రచయిత్రిని రానిచ్చారు! చైనా గురించి అసలు చరిత్ర మనకు రాలేదు . కమ్మూనిస్టుల పార్టీ ప్రచార రచనల ప్రభావంలో ఇన్నాళ్ళూ కొట్టుకపోయిన ధోరణికి రచయిత్రి అడ్డుకట్ట వేసి ,అందరికీ అందుబాటులో వుండేటట్లు వివరణ చేసింది.

38 అధ్యాయాలతో వున్న ఈ రచన లో ప్రత్యేక ఆకర్షణగా, రచయిత్రి , చైనాలో తన కుటుంబం, చైనా పాలకుల చిత్రాలు అందించారు. చైనా గ్రేట్ వాల్ వెనుకవున్న అమాయకత్వం,పేదరికం, జైళ్ళలో క్రూరత్వం వివరంగా చదవనగును. 1978నుండీ యుంగ్ చాంగ్ భర్త హాలిడే తో ఇంగ్లాండ్ లో ఉంటూ, రచనలు కొన సాగిస్తున్నారు.అడవిగాచిన వెన్నెల గమనిస్తే నవల, జీవిత చరిత్ర, దేశ గమనం,రాజకీయ చదరంగం,ఏర్చి కూర్చి సానబట్టినట్లు కనబడుతుంది.రచయిత్రి అమ్మమ్మ, తల్లి అనుభవాలను చరిత్రలో ఇమిడ్చి రాసిన తీరు ఆశ్చర్యం గొలుపుతుంది. మావో ప్రారంబించిన సాంస్కృతిక విప్లవంలో చేరి, దానికి ఆహుతి అయిన తీరు గొప్పగా చెప్పారు.

అడవిగాచిన వెన్నెల రచయిత్రి యుంగ్ చాంగ్ (Jung Chang) హైదరాబాదులో ఈ పుస్తకం విశేషాలు స్వయంగా వివరించారు. చిత్రంలో (ఎడమనుంచి కుడి వైపు) యుంగ్ చాంగ్, అనువాదకురాలు కోమల ఇంకా రచయిత్రి భర్త , బ్రిటిష్ చరిత్ర కారుడు జాన్ హాలిడే.

బయట ప్రపంచం చూసిన తరువాత గాని అంత కాలం బావిలో కప్పలవలె ఎలా వున్నామో అనేది రచయిత్రికి తెలిసి మనకు విడమరచి చెప్పింది. భారత దేశానికి చైనాకు గల సంబంధం వలన కూడా ఈ రచనకు విశిష్టత సమకూడింది. దీనిపై రంగనాయకమ్మ విపులమైన నిశిత సమీక్ష ఆంధ్ర ప్రభలో రాసి, పుస్తకంగా ప్రచురించారు. అమెరికా, యూరోప్ లు ఈ రచనను ఆదరిస్తే, తెలుగు పాఠకులు ఇంచుమించు అంతే స్వాగతం పలికారు. ———————————————————————————
రచయిత్రి యుంగ్ చాంగ్ 1952 లో చైనా దేశపు సిచూఅన్ ప్రోవిన్స్ లోని ఇబిన్ లో జన్మించారు. తన 14 వ ఏట కొద్దికాలం రెడ్ గార్డ్ గా ఉన్నారు. చైనా లో వివిధ వృత్తుల లో పనిచేసి, యు. కె వెళ్లి లింగ్విస్టిక్స్ లో పి.హెచ్.డి.చేసి, లండన్ యునివర్సిటీ లో ఒరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ డిపార్ట్మెంట్ లో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.

అనువాదకురాలు వెనిగళ్ళ కోమల హైదరాబాద్ లో అంబేద్కర్ యూనివర్సిటి ఇంగ్లీష్ విశ్రాంత ఆచార్యులు. పలు ప్రసిద్ధ గ్రంధాలను తెలుగులో అనువాదం చేశారు. ప్రస్తుతం అమెరికాలో కుమార్తె డా.నవీన వద్ద వుంటున్నారు.

అడవిగాచిన వెన్నెల -చైనా వనితల వెతలు
Wild Swans – Three Daughters of China – Jung Chang
అనువాదం: వెనిగళ్ల కోమల
తెలుగు అనువాద ప్రచురణ: 2007
డెమి ఆకారంలో 630 పేజీలు
ధర: రూ.295/- US$20/-
ప్రముఖ పుస్తక దుకాణాలలో లభ్యం

అడవిగాచిన వెన్నెల e-book ఇక్కడ చదవవొచ్చు, ఇంకా దిగుమతి చేసుకోవచ్చు.