Archive for July, 2008

సమీక్ష: అమెరికా….అమెరికా – అంపశయ్య నవీన్

July 20, 2008

  

అమెరికా….అమెరికా – యాత్రా నవల

రచన: అంపశయ్య నవీన్

ప్రచురణ: ప్రత్యూష ప్రచురణలు, వరంగల్ -506 001

తొలి ముద్రణ: డిసంబర్, 2007

ప్రతులకు:నవొదయ బుక్ హౌస్, కాచిగూడా X రోడ్స్,

హైదరాబాదు – 500 001

మరియు అన్ని ప్రముఖ పుస్తకాలషాపులు

304 పేజీలు; ధర 150 రూపాయలు

పుస్తకాలు రెండు రకాలుంటాయి. మొదటిది మనల్ని తొలిపేజీ నుంచి తుదికంటా చదివిస్తాయి. రెండోది మొదట నుంచీ చివరదాకా మనమే చదవాలి.అంపశయ్య నవీన్ రాసిన తాజా నవల మొదటి రకానికి చెందుతూంది.ఇందులోని సన్నివేశాలు, పాత్రలు ఇంకా ప్రదేశాలు అన్నీ నిజమైనవి. ఏవీ కల్పితం కాదు.ఇంకో ప్రత్యేకత ఏమంటే, కొన్ని పాత్రలు మీకు తెలిసినవే. రచ్చబండ సభ్యులకు తెలిసిన శ్రీయుతులు జంపాల చౌదరి,జయదేవ్ మెట్టుపల్లి , మద్దిపాటి కృష్ణారావు,ఆరి సీతారామయ్య,నాసి శంకగిరి (శంకగిరి నారాయణస్వామి), మురళీ కృష్ణ, వేమూరి వెంకటేశ్వర రావు, సురేష్ కొలిచాల, కిరణ్ ప్రభ, తమ్మినేని యదుకుల భూషణ్,విన్నకోట రవిశంకర్‌,వెల్చేరు నారాయణరావు వగైరా ప్రముఖులు ఈ నవలలో కొన్ని పాత్రలుగా కనిపిస్తారు.

నిజానికి ఈ పుస్తకాన్ని యాత్రాస్మృతి (Travelogue) గా నమోదు చెయ్యాలి కాని చూసిన ప్రదేశాల వర్ణనతో బాటుగా, తను కలిసిన వ్యక్తుల అంతరంగాల ఆవిష్కరణతో, ఇది యాత్రా నవలగా రూపాంతరం చెందింది. 2006 జూన్ మాసంలో లాస్ ఏంజల్స్ నగరంలో జరిగిన, ఆటావారి సభలకు, ఈ నవలా రచయితను రమ్మనమన్న ఆహ్వానం తొ మొదలై, అమెరికా లో తను చూసిన ప్రదేశాలతో,ఈ ట్రావెలాగ్ పొడిగా వుండక, అనేక ఉత్కంఠ భరితమైన సంఘటనలతో, కలిసిన వ్యక్తుల వ్యధల వివరణతో, రచయిత తో కలిసి ఆ ప్రదేశాలను చూసేలా, అక్కడి వ్యక్తుల సుఖ దుఃఖాలు మనమూ పంచుకునేలా రాశారు.

అమెరికా ఇంతవరకూ సందర్శించని వారిని ఆశ్చర్య పరిచే విషయాలున్నాయీ పుస్తకంలో. శాన్‌ఫ్రాన్సిస్‌స్కో లో ప్రయణీకులను చేరవేసే రిక్షాలున్నాయంటే నమ్మటం కష్టం.మన హైదరాబాదు లోనే రిక్షాలు కనుమరుగయ్యి చాలా కాలమయ్యింది. చికాగో నుంచి డెట్రాయిట్ కు 5 గంటల కారు ప్రయాణం. రెండు గంటలకు డెట్రాయిట్ లో సమావేశముంటే, చికాగో లో 8 గంటలకు బయలుదేరితే, ఒంటి గంటకు చేరుకొని, ఒక గంట భొజనానికి కేటాయించినా , రెండు గంటలకు సమావేశానికి చేరవచ్చు. అయినా రచయిత సమావేశానికి గంట ఆలస్యంగా వచ్చినట్లవుతుంది; అక్కడివారి లెక్కలో. కారణం చికాగో సమయానికంటే, డెట్రాయిట్ సమయం ఒక గంట ముందుంటుంది కనుక. ఒక ఊరినుంచి ఇంకో ఊరికి వెళ్లాలంటే,దారి తెలియక పోయినా, మన దేశం లో ఎలాంటి ప్లాన్ లేకుండానే బయలుదేరిపోతాము. ఏ జంక్షన్ లోనో అనుమానం వస్తే, అటుగా పోతున్న వారిని కేకేసి దారి తెలుసుకుని పయనం సాగిస్తాము. మరి అమెరికా లో, రహదారిపై, పాదచారులు కనపడని పరిస్తితిలో, దారి ఎవరు చెపుతారు? అక్కడి కార్లలో నావిగేషన్ సిస్టం మనము ఎటు వెళ్లాలో, ఎక్కడ మలుపు తిరగాలో, గాస్ స్టేషన్ ఎంత దూరంలో వుందో తెలియచెప్తుంది, తన గొంతు తో.

ఈ నవలలోని పాత్రలు, సంయుక్త, సురేంద్రల వివాహజీవితం లోని అనుకోని మలుపులు మనలను ఆశ్చర్య చకితులను చేస్తాయి.వర్కహాలిక్ అయిపోయి, సురేంద్ర తనను నిర్లక్ష్యం చెయ్యటం వలననే, తాను సురెంద్ర నుంచి దూరం అయ్యి, ఫెర్నాండెజ్కు దగ్గరయ్యానని, సంయుక్త చెప్పే కథనం, పాఠకులను షాక్ కు గురిచేస్తుంది. టూరిస్ట్ వీసా పై అమెరికా వచ్చి, నానా అవస్థలు పడి, అడ్దదారిలో వర్క్ వీసా తెచ్చుకొని, పదేళ్లపాటు, భార్యా బిడ్డలకు దూరంగా, అమెరికాలోనే వుండిపోవాల్సివచ్చిన పురుషొత్తం కథ, పాఠకులను కంట తడిపెట్టిస్తుంది. అమెరికాలో నివసిస్తున్న, ఇలాంటి వ్యక్తుల, యదార్ధ,వ్యధాభరితమైన కథనాలు, ఈ నవలలో చాలా వున్నై. అట్లాంటా విమానాశ్రయంలో తనకు స్వాగతం చెప్పవలసిన కొలిచాల సురేష్ గారి కోసం, మూడు గంటలు, రెస్ట్ రూం కు కూడా వెళ్లకుండా, ప్రాణాలుగ్గబట్టి, రచయిత నిరీక్షించవలసిన, విచిత్ర పరిస్తితి, పగవాడికి కూడా, రాకూడదు బాబోయ్ అనిపిస్తోంది.

అనువాదాలు మూలానికి దగ్గరగా వుండాలా, లేక అనువదించబడిన భాష పాఠకుల సంస్కృతి, అక్కడి భాషా నుడికారాల పై ఆధారపడి చెయ్యాలా అనే విషయం పై నవీన్, వేమురి వెంకటెశ్వర రావు గార్ల చర్చ ఆసక్తి దాయకంగా వుంది. ఎవో కొన్ని లోపాలున్నప్పటికీ, వెల్చేరు నారాయణరావు గారి అనువాదాలు, ఆంగ్ల పాఠకులకు తెలుగు వారి రచనలను పరిచయం చేస్తున్నాయి కనుక అవి అభినందనీయమని వేమూరి వెంకటేశ్వర రావు గారు అభిప్రాయం వ్యక్త పరిస్తే, ఆ అనువాదాలు ఘోరమనీ, లోప భూయిష్టమనీ మరో రచయిత సూర్యం గారు అభిప్రాయపడి ఆ విషయాన్ని రచయితకు చెప్పిన సన్నివేశం విపులంగా వుందీ పుస్తకంలో. సూర్యం గారు వెల్చేరు నారాయణరావు గారి అనువాదాలను విమర్శిస్తూ రాసి ప్రచురించిన, పుస్తకం వివరాలు, నవీన్ గారు ఇచ్చిఉంటే, పాఠకులకు ఉపయోగకరంగా వుండేది.

అట్లాంటా లో తెలుగు మితృలతో, వేమురి వెంకటెశ్వర రావు, కొలిచాల సురేష్ గార్లు,ఏర్పరచిన సమావేశం లో, నవీన్, తెలుగు నవలలో అస్తిత్వ వాదం అనే అంశం పై మాట్లాడారు. భారతదేశం లో సమాజానికి ప్రాముఖ్యత ఇస్తే, అమెరికా లో వ్యక్తి స్వాతంత్రానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వటం జరిగిందనీ, జీన్ పాల్ సాత్రె చెప్పిన అస్తిత్వ వాదనలో, వ్యక్తి స్వాతంత్రమే కాదు, బాధ్యతను గూర్చి కూడా చెప్పటం జరిగిందనీ, తెలుగులో బుచ్చిబాబు, వడ్డెర చండీ దాస్, ఆర్.ఎస్.సుదర్శన్ ఇంకా కాశీభట్ల వేణుగోపాల్ లాంటి వారు తమ రచనలలో అస్తిత్వవాదానికి పెద్దపీట వేశారని చెప్పారు. పూర్తి ప్రసంగ పాఠానికై కింద ఇచ్చిన లింక్ ను అనుసరించండి.

http://eemaata.com/em/issues/200609/918.html

నవీన్ గారు దెట్రాయిట్ DTLC group సమావేశం లో అనువాద సమస్యలు గూర్చి మాట్లాడారు. కాలరేఖలు నవల లోని రాజు, తానేనని రచయిత చెప్పటం జరిగింది. మరిన్ని వివారాలు కై కింది లింక్ ను అనుసరించండి.

http://groups.yahoo.com/group/DTLCgroup/message/505

కొందరు వ్యక్తులు, రచయిత పై విశ్వాసముంచి చెప్పిన ఎన్నో అంతరంగిక విషయాలు, తన నవల లో రాయటం, ఎంతవరకూ సబబో తెలియటం లేదు. ఈ యాత్రా నవల లో చిత్రాలు (ఫొటోస్) లేవనేది, నమ్మలేని నిజం. శాన్‌ఫ్రాన్సిస్‌స్కో లో, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దాటి, మార్టిన్ హేడ్ లాండ్స్ కొండపై నుంచి పసిఫిక్ సముద్రం, గోల్డేన్ గేట్ దృశ్యం, మనోహరం గా వర్ణించారు. ఆ నగరం లోని విశేషాలన్నీ చూడటానికి సమయాభావమున్నా, అక్కడి ప్రసిద్ధి గాంచిన, కేబుల్ కార్, పీర్ 39 లోని Sea Lions, దగ్గరలో వున్న ద్వీపం లోని Alcatraz high security prison గురించిన ప్రస్తావన కూడా లేదు. పుస్తకంలో అక్కడక్కడా స్వల్పమైన తప్పులున్నాయి. కొలిచాల సురేష్, వెలిశాల సురేష్ గా అచ్చయింది.

అయిపోయిన మిల్వాకీ సభకు, రచయితను జంపాల చొదరి గారు ఆహ్వానించటం ఒక comedy of error.అమెరికా లో అస్తిత్వ వాదమెక్కువయ్యి, అనేక వ్యక్తిగత సమస్యలతో బాధపడేవారి, మానసిక క్షొభను చిత్రించటంలో రచయిత సఫలమయ్యారు.

గమనిక: ఈ సమీక్ష జులై 2008 లో న్యూ జెర్సీ (ఉత్తర అమెరికా) లో జరిగిన ATA సభలలో విడుదల చేసిన ప్రత్యేక సావనీర్ లో అచ్చయ్యింది. సావనీర్ సంపాదకులకు, ఆటా వారికి నా కృతజ్ఞతలు.